Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి మరియు పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, అటవీ శాఖల మంత్రి పవన్ కళ్యాణ్ తన శాఖల ఇంజనీరింగ్ అధికారుల పనితీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. నిధులు పుష్కలంగా అందుబాటులో ఉన్నప్పటికీ, పనులు మాత్రం తాము ఆశించినంత వేగంగా ముందుకు సాగడం లేదంటూ ఆయన అధికారులను నిలదీశారు.
మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ సమీక్షా సమావేశంలో… పల్లె పండగ 2.0, అడవి తల్లి బాట పనుల పురోగతి, జల్ జీవన్ మిషన్, స్వమిత్వ పథకం వంటి ప్రధాన కార్యక్రమాల అమలు స్థితిపై పవన్ కళ్యాణ్ అధికారుల నుండి వివరాలు అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ కీలకమైన ప్రకటనలు చేశారు. గ్రామీణ రహదారుల నిర్మాణం, వాటి పర్యవేక్షణ కోసం త్వరలో ‘జియో రూరల్ రోడ్ మేనేజ్‌మెంట్ సిస్టమ్’ అనే కొత్త సాంకేతిక వ్యవస్థను ప్రవేశపెడతామని స్పష్టం చేశారు. మొదట్లో అడవి తల్లి బాట ప్రాజెక్టును ఈ కొత్త టెక్నాలజీకి అనుసంధానం చేస్తామని తెలిపారు. సాస్కీ నిధులతో పల్లె పండగ 2.0 కార్యక్రమం అమలు జరుగుతుందని వెల్లడించారు.
క్షేత్రస్థాయి పర్యవేక్షణ:
అంతేకాకుండా, ఈ నెల 17వ తేదీ నుంచి తాను స్వయంగా క్షేత్రస్థాయి పర్యటనలు చేపట్టి, జల్ జీవన్ మిషన్ మరియు స్వమిత్వ పథకాల పనులను పర్యవేక్షిస్తానని పవన్ కళ్యాణ్ ప్రకటించారు. వచ్చే ఏడాది మార్చి నాటికి కోటి స్వమిత్వ కార్డులను ప్రజలకు పంపిణీ చేస్తామని లక్ష్యాన్ని నిర్దేశించారు. సుమారు 761 గిరిజన గ్రామాలను అనుసంధానించే 662 రహదారుల నిర్మాణానికి గాను, రూ. 1,158 కోట్లు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. అలాగే, రూ. 2,123 కోట్ల సాస్కీ నిధులతో 4,007 కిలోమీటర్ల గ్రామీణ రహదారులు, గోకులాలు, మరియు డ్రైన్ల నిర్మాణ పనులు చేపట్టనున్నట్లు ఆయన ప్రకటించారు.

