Pawan Kalyan

Pawan Kalyan: జనవరి 3న కొండగట్టుకు పవన్ కల్యాణ్.. రూ. 35 కోట్లతో అభివృద్ధి పనులకు శ్రీకారం!

Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి, జనసేనాని పవన్ కల్యాణ్ తన సెంటిమెంట్ క్షేత్రమైన తెలంగాణలోని కొండగట్టు అంజన్న సన్నిధికి మరోసారి చేరుకోనున్నారు. జనవరి 3న మార్గశిర పౌర్ణమి వంటి పవిత్రమైన రోజున ఆయన కొండగట్టును సందర్శించి, స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. ఏపీలో కూటమి ప్రభుత్వం చారిత్రాత్మక విజయం సాధించి. 

టీటీడీ నిధులతో ఆలయ రూపురేఖలు మార్చేలా..

కేవలం దర్శనానికే పరిమితం కాకుండా, కొండగట్టు క్షేత్రాన్ని మరింత అభివృద్ధి చేసే దిశగా పవన్ కల్యాణ్ కీలక అడుగులు వేస్తున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) నుంచి మంజూరైన సుమారు రూ. 35 కోట్ల నిధులతో చేపట్టనున్న వివిధ అభివృద్ధి పనులకు ఆయన ఈ పర్యటనలో శంకుస్థాపన చేయనున్నారు. భక్తుల సౌకర్యార్థం 100 గదులతో కూడిన అత్యాధునిక ధర్మశాల, ఒకేసారి 2,000 మంది హనుమాన్ దీక్షాధారులు మాల విరమణ చేసేలా నిర్మించనున్న భారీ మండపం ఈ పనుల్లో ప్రధానమైనవి. సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తుల కోసం ప్రత్యేక వసతి గృహాల నిర్మాణానికి కూడా ఆయన భూమిపూజ చేయనున్నారు.

ప్రాణదాత.. విజయదాత.. ఆ కొండగట్టు అంజన్నే!

పవన్ కల్యాణ్‌కు, కొండగట్టు అంజన్నకు మధ్య ఉన్న అనుబంధం కేవలం భక్తికి మించినది. 2009 ఎన్నికల ప్రచారంలో భాగంగా జరిగిన విద్యుత్ ప్రమాదంలో మృత్యువు అంచుదాకా వెళ్లిన తనను ఆ అంజన్నే ప్రాణాలతో కాపాడారని పవన్ గాఢంగా విశ్వసిస్తారు. అందుకే తన రాజకీయ ప్రస్థానంలో ఏ కీలక నిర్ణయం తీసుకున్నా ఆయన కొండగట్టు నుంచే ప్రారంభిస్తుంటారు. గతంలో ఎన్డీఏ కూటమితో పొత్తు ప్రకటన చేయడం నుంచి, తన ప్రచార రథం ‘వారాహి’కి వాహన పూజ నిర్వహించడం వరకు అన్నీ ఇక్కడే జరిగాయి.

రాజకీయాలకు అతీతంగా ఆధ్యాత్మిక పర్యటన

ఈ పర్యటన ఆధ్యాత్మిక ప్రాధాన్యతతో కూడుకున్నదని, రాజకీయ హడావుడికి దూరంగా ఉంటుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. టీటీడీ నేతృత్వంలో జరిగే అభివృద్ధి కార్యక్రమాలకు డిప్యూటీ సీఎం హోదాలో పవన్ హాజరవుతున్నారు. అయితే, తెలంగాణ గడ్డపై పవన్ పర్యటిస్తుండటంతో ఆయన అభిమానులు, జనసేన కార్యకర్తలు భారీగా తరలివచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *