Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఉప్పాడలో జరిగిన బహిరంగ సభలో మత్స్యకారుల సమస్యలపై మాట్లాడిన తీరు అందరి దృష్టిని ఆకర్షించింది. సమస్యలు పరిష్కరించడానికి కొంత సమయం ఇవ్వాలని కోరుతూనే, వారికి న్యాయం చేయలేకపోతే రాజకీయాలు వదిలి వెళ్లిపోతానని ఉద్వేగభరితంగా ప్రకటించారు.
కాలుష్య సమస్యపై కీలక హామీ
మత్స్యకారులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య పరిశ్రమల నుంచి వస్తున్న కాలుష్యం. ముఖ్యంగా దివిస్, అరబిందో వంటి కంపెనీల వల్ల చేపల వేటపై ఆధారపడి జీవిస్తున్న 7193 కుటుంబాలు తీవ్రంగా నష్టపోతున్నాయని మత్స్యకారులు పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై స్పందించిన ఆయన, పరిశ్రమలు అవసరమే అయినా, వాటి వల్ల తప్పులు జరిగితే సరిదిద్దుకునేలా తప్పనిసరిగా చేస్తామన్నారు. వ్యర్థాలను శుద్ధి చేయకుండా సముద్రంలో వదిలేయడం పెద్ద సమస్యగా మారిందని గుర్తించారు.
ఈ సమస్యను లోతుగా తెలుసుకోవడానికి కేవలం మూడు రోజుల్లోనే తాను పిఠాపురం తిరిగి వస్తానని, అప్పుడు పడవలో వెళ్లి సముద్రంలో కాలుష్యాన్ని స్వయంగా పరిశీలిస్తానని పవన్ కళ్యాణ్ ప్రకటించారు. ఇప్పటికే పొల్యూషన్ ఆడిట్ చేయాలని అధికారులను ఆదేశించామన్నారు. ఈ కంపెనీలను 2005లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారే తీసుకువచ్చారని కూడా ఆయన గుర్తు చేశారు.
ఇతర సమస్యలపై దృష్టి
అమీనాబాద్ హార్బర్ డిజైన్ లోపం కారణంగా జరుగుతున్న ప్రమాదాలను కూడా ఆయన దృష్టికి తీసుకువచ్చారు. అలాగే, తీరప్రాంత రక్షణ కోసం 323 కోట్లతో ఉప్పాడ తీర ప్రాంత గోడ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా ఉందని, ఈ నెల 14న కేంద్ర హోం శాఖ ఆధ్వర్యంలో దీనిపై సమావేశం జరుగుతుందని తెలిపారు.
“నాకు 100 రోజులు సమయం ఇవ్వండి”
సమస్యల పరిష్కారానికి తనకు కొంత సమయం ఇవ్వాలని మత్స్యకారులను పవన్ కళ్యాణ్ కోరారు. “నాకు 100 రోజులు సమయం ఇవ్వండి, యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తాను” అని భరోసా ఇచ్చారు. న్యాయం చేస్తామని చెప్పి పబ్బం గడుపుకునే రాజకీయ నాయకుల ట్రాప్‌లో పడొద్దని వారికి విజ్ఞప్తి చేశారు. గతంలో ఈ పరిశ్రమలను వైసీపీ నాయకులే ఇచ్చారని ఆయన ఆరోపించారు.
“మీరు తిడితే నేను పడతాను, నా భుజం మీద దెబ్బ కొడితే పడతాను. నేను ఇక్కడే ఉంటాను, ఎక్కడికీ పారిపోను” అంటూ మత్స్యకారులకు సంపూర్ణ న్యాయం చేస్తానని, వారి పక్షాన నిలబడతానని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. వారి సమస్యల పరిష్కారానికి తన పూర్తి చిత్తశుద్ధిని తెలియజేశారు.