Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ప్రధాని నరేంద్ర మోడీని ‘కర్మయోగి’గా అభివర్ణించారు. ఎలాంటి లాభం ఆశించకుండా దేశం కోసం పనిచేస్తున్నందుకే మోడీని కర్మయోగి అంటామని ఆయన అన్నారు.
కర్నూలు జిల్లా నన్నూరు దగ్గర జరిగిన ‘సూపర్ జీఎస్టీ- సూపర్ సేవింగ్స్’ అనే భారీ బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ మాట్లాడారు. ఈ సభకు ప్రధాని నరేంద్ర మోడీ, గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ సహా పలువురు కేంద్ర, రాష్ట్ర మంత్రులు, నాయకులు హాజరయ్యారు.
జీఎస్టీతో సామాన్యులకు ఉపశమనం
జీఎస్టీ సంస్కరణలను ప్రవేశపెట్టి ప్రధాని మోడీ సామాన్య ప్రజలకు ఉపశమనం కల్పించారని పవన్ కళ్యాణ్ ఈ సందర్భంగా తెలిపారు.
ఏపీలో 15 ఏళ్ల కూటమి పాలన కావాలి
ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం 15 ఏళ్ల పాటు అధికారంలో ఉండాలని పవన్ కళ్యాణ్ ఆకాంక్షించారు. దీని కోసం ఎన్ని కష్టాలు వచ్చినా ఎదుర్కొని నిలబడతామని చెప్పారు. ఎలాంటి ఇబ్బందులు ఉన్నా తట్టుకుని నిలబడాలని ఆయన సూచించారు.
చంద్రబాబు, మోడీ నాయకత్వంలో ముందుకు
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒక తరం గురించి ఆలోచించే నాయకుడని పవన్ కళ్యాణ్ ప్రశంసించారు. ప్రధాని మోడీ, సీఎం చంద్రబాబు నాయకత్వంలో అందరం కలిసికట్టుగా పనిచేస్తామని, భవిష్యత్ తరాల ఆశయాలను ముందుకు తీసుకువెళ్తామని స్పష్టం చేశారు.
మోడీ దేశాన్ని నడిపిస్తున్నారు
ప్రధాని మోడీ దేశాన్ని మాత్రమే కాకుండా, రెండు తరాలను నడిపిస్తున్నారని పవన్ కళ్యాణ్ అన్నారు. దేశం గర్వపడేలా ‘ఆత్మనిర్భర్ భారత్’ కార్యక్రమాన్ని తీసుకువచ్చారని కొనియాడారు. దేశ పటాన్ని ప్రపంచ పటంలో సగర్వంగా నిలబెట్టారని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.