Pawan Kalyan: అమరావతిలో జరిగిన జనసేన పార్టీ పదవి–బాధ్యతల కార్యక్రమంలో డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీ నామినేటెడ్ పదవుల్లో ఉన్న నాయకులు, కార్యకర్తలతో నిర్వహించిన ఈ సమావేశంలో ఆయన రాజకీయాలు, ప్రజాసేవ, బాధ్యతాయుత నాయకత్వంపై స్పష్టమైన సందేశం ఇచ్చారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక సామాజికవర్గాలకు కార్పొరేషన్లు ఏర్పాటు చేశామని పవన్ కళ్యాణ్ తెలిపారు. రెల్లి సామాజికవర్గానికి కూడా ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. పట్టణ ప్రాంతాలతో పాటు గ్రామీణ ప్రాంతాల వారికి కూడా అవకాశాలు కల్పించామని అన్నారు.
జనసేనలో ఇప్పటివరకు 3,400 మందికి నామినేటెడ్ పదవులు ఇచ్చామని, త్వరలో మరింత మందికి అవకాశం కల్పిస్తామని పవన్ తెలిపారు. ప్రజా సమస్యలపై పోరాడిన వారికే పదవులు ఇచ్చామని, సోషల్ మీడియా కార్యకర్తలను కూడా గుర్తించి బాధ్యతలు అప్పగించామని చెప్పారు. “పదవి అంటే గౌరవం కాదు… బాధ్యత” అని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వారిని గుర్తించి గౌరవించడమే తమ ఉద్దేశమన్నారు. ఎన్నికల్లో ఓడిపోయినా పార్టీకి అండగా నిలబడ్డ నాయకులు నిజమైన నాయకులని వ్యాఖ్యానించారు.
Also Read: Droupadi Murmu: ముగిసిన రాష్ట్రపతి శీతాకాల విడిది.. హైదరాబాద్ నుంచి దిల్లీకి పయనమైన ద్రౌపదీ ముర్ము
పార్టీ నిర్మాణం చాలా కష్టమైన ప్రక్రియ అని పేర్కొన్న పవన్ కళ్యాణ్, గెలుపు–ఓటముల్లో ఎలా నిలబడతారన్నదే అసలైన నాయకత్వమన్నారు. యువతకు సరైన రాజకీయ వేదిక లేకపోతే వారు తప్పుదారి పట్టే ప్రమాదం ఉందని, అందుకే ప్రజాస్వామ్య పద్ధతిలో పోరాడే వేదికగా జనసేనను స్థాపించానని చెప్పారు. ప్రజాస్వామ్యం బలహీనపడితే రౌడీయిజం రాజ్యమేలుతుందని హెచ్చరించిన పవన్, రాజ్యాంగానికి లోబడి పనిచేయడమే తమ విధానమన్నారు. విధానాలపై ప్రశ్నించే పార్టీలను తాము వ్యతిరేకించమని, చివరి అస్త్రంగా మాత్రమే పోరాటానికి దిగుతామని స్పష్టం చేశారు.
లా అండ్ ఆర్డర్ దెబ్బతింటే టూరిజం కూడా దెబ్బతింటుందని, బెదిరింపుల రాజకీయాలను సహించబోమని పవన్ కళ్యాణ్ అన్నారు. తనకు పార్టీ కన్నా ప్రజల భద్రతే ముఖ్యమని, రాష్ట్రానికి భంగం కలగకుండా చూసే బాధ్యత తనదని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు జనసేన పార్టీ దిశ, భావజాలం, భవిష్యత్ కార్యాచరణపై స్పష్టతనిచ్చాయని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.
