Pawan Kalyan

Pawan Kalyan: రాజ్యాంగ విలువలను కాపాడారు.. ధన్‌ఖడ్‌ రాజీనామా పై స్పందించిన పవన్ కల్యాణ్‌

Pawan Kalyan: ఉపరాష్ట్రపతి పదవికి జగదీప్ ధన్‌ఖడ్‌ ఆకస్మికంగా రాజీనామా చేయడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. సోమవారం వర్షాకాల పార్లమెంటు సమావేశాల తొలి రోజున రాజ్యసభ చైర్మన్‌గా సజావుగా కార్యక్రమాలను నడిపిన ధన్‌ఖడ్‌ రాత్రికి రాత్రే రాజీనామా లేఖను రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు పంపించారు. అనారోగ్య కారణాలతోనే పదవి నుంచి తప్పుకుంటున్నానని లేఖలో పేర్కొన్నారు.

పవన్ కళ్యాణ్ హృదయపూర్వక శుభాకాంక్షలు

ధన్‌ఖడ్‌ రాజీనామాపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. ఆయన ‘ఎక్స్‌’ వేదికగా చేసిన పోస్ట్‌లో ఇలా పేర్కొన్నారు:
“మీ పదవీకాలంలో ఉపరాష్ట్రపతి పదవీ గౌరవాన్ని అచంచలమైన నిబద్ధతతో నిలబెట్టారు. రాజ్యాంగ విలువలను కాపాడుతూ, రాజకీయ ఒత్తిడి లేకుండా నిర్భయంగా మీ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. మీకు మంచి ఆరోగ్యం, ప్రశాంతమైన జీవనం ఉండాలని హృదయపూర్వక శుభాకాంక్షలు.” అంటూ రాసుకొచ్చారు. 

రాజీనామాపై అనుమానాలు

ధన్‌ఖడ్‌ రాజీనామా రాజకీయంగా పెద్ద చర్చలకు దారితీసింది.

  • కాంగ్రెస్ ఎంపీ జైరామ్ రమేష్ ఈ రాజీనామాపై సంచలన వ్యాఖ్యలు చేశారు. సోమవారం సాయంత్రం జరగాల్సిన బీఏసీ మీటింగ్‌కు బీజేపీ నేతలు నడ్డా, రిజిజు హాజరు కాలేదని, ధన్‌ఖడ్‌ అసంతృప్తి వ్యక్తం చేసినట్లు ఆయన పేర్కొన్నారు. “మధ్యాహ్నం 1 గంట నుంచి 4.30 గంటల మధ్య ఏదో పెద్ద పరిణామం జరిగింది” అని జైరామ్ రమేష్ ట్వీట్ చేశారు.

  • సోషల్ మీడియాలో కూడా అనేక ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. ఉదయం పార్లమెంటు కార్యక్రమాలను చురుగ్గా నడిపిన ధన్‌ఖడ్‌ రాత్రికి రాత్రే అనారోగ్య కారణాలను చూపించడం పై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

తాత్కాలిక చైర్మన్ బాధ్యతలు

2022 ఆగస్టు 11న ఉపరాష్ట్రపతిగా బాధ్యతలు స్వీకరించిన ధన్‌ఖడ్‌కు 2027 ఆగస్టు వరకు పదవీకాలం ఉంది. అయితే ఇంకా రెండు సంవత్సరాలు మిగిలి ఉండగానే రాజీనామా చేయడం ఆశ్చర్యకరంగా మారింది. ప్రస్తుతం రాజ్యసభ సమావేశాలను డిప్యూటీ చైర్మన్ హరివంశ నడిపించనున్నారు.

రాజకీయంగా హాట్ టాపిక్

74 ఏళ్ల ధన్‌ఖడ్‌ ముందుగా పశ్చిమ బెంగాల్ గవర్నర్‌గా కూడా పనిచేశారు. ఇలాంటి అనుభవం ఉన్న నేత ఆకస్మికంగా రాజీనామా చేయడంతో దేశ రాజకీయాల్లో ఇది పెద్ద చర్చకు దారి తీసింది. అనారోగ్యమే అసలు కారణమా? లేక కేంద్ర ప్రభుత్వంతో విభేదాల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నారా? అన్న అనుమానాలు ఇంకా కొనసాగుతున్నాయి.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *