Pawan Kalyan: ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) సంస్కరణలపై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రశంసలు కురిపించారు. ఈ సంస్కరణలు కోట్లాది కుటుంబాల కష్టాలను తగ్గిస్తాయని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియా వేదిక ఎక్స్ (గతంలో ట్విట్టర్)లో ఒక పోస్ట్ చేశారు. ప్రజల సంక్షేమంపై దృష్టి సారించి ఈ కీలక నిర్ణయాలు తీసుకున్నందుకు ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, జీఎస్టీ కౌన్సిల్‌కు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.
జీఎస్టీ రేట్లలో మార్పులు, కొన్ని పన్ను స్లాబ్‌లను తొలగించడం ద్వారా కేంద్ర ప్రభుత్వం ప్రజలకు నిజమైన దీపావళి కానుక ఇచ్చిందని పవన్ కల్యాణ్ అన్నారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఎర్రకోట నుంచి ప్రధాని మోదీ ఇచ్చిన హామీని కేంద్రం నెరవేర్చిందని ఆయన గుర్తు చేశారు. ఈ నూతన సంస్కరణలు ‘నెక్స్ట్-జెనరేషన్ జీఎస్టీ సంస్కరణలు’ అని పేర్కొన్నారు. ముఖ్యంగా పేద, మధ్యతరగతి వర్గాలకు, రైతులకు, ఆరోగ్య రంగానికి ఈ నిర్ణయాలు గణనీయమైన ఉపశమనం కల్పిస్తాయని ఆయన నొక్కి చెప్పారు.
Also Read: Tube Master: టీచర్ అంటే ఎలా ఉండాలో చూపిన లెక్కల మాస్టర్.. 20 ఏళ్లుగా స్కూల్‌కి వెళ్లేందుకు నదిలో ఈత
జీవితానికి ఎంతో భద్రత కల్పించే విద్య, బీమా రంగాలపై జీఎస్టీని పూర్తిగా రద్దు చేయడాన్ని పవన్ కల్యాణ్ ప్రత్యేకంగా స్వాగతించారు. ఈ నిర్ణయం ఎన్నో కుటుంబాలపై ఉన్న ఆర్థిక భారాన్ని తగ్గిస్తుందని, వారి భవిష్యత్తుకు భరోసా కల్పిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రజల భవిష్యత్తును మరింత మెరుగుపరచడానికి ప్రభుత్వం తీసుకున్న ఈ చర్యలు ప్రశంసనీయమని పవన్ పేర్కొన్నారు.
బీజేపీ ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి కూడా జీఎస్టీ సంస్కరణలను కొనియాడారు. ప్రధాని మోదీ ఇచ్చిన హామీ మేరకే ఈ మార్పులు వచ్చాయని ఆమె పేర్కొన్నారు. కేంద్ర మంత్రులు జి. కిషన్ రెడ్డి, బండి సంజయ్ కుమార్ కూడా ఈ సంస్కరణలపై సంతోషం వ్యక్తం చేశారు. పన్ను రేట్ల తగ్గింపు ఆర్థిక వ్యవస్థకు ఊతమిస్తుందని, వ్యాపారులు, రైతులు, సామాన్య ప్రజలకు ఉపశమనం లభిస్తుందని వారు తెలిపారు. బండి సంజయ్ ఈ నిర్ణయాన్ని ప్రజలకు నిజమైన దీపావళి కానుకగా అభివర్ణించారు. ఈ సంస్కరణలు దేశ అభివృద్ధికి, ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడానికి ఎంతగానో తోడ్పడతాయని నాయకులు పేర్కొన్నారు.
Fulfilling the assurance given from the Red Fort on Independence Day, Hon’ble PM Sri @NarendraModi Ji led Central Government has now brought forward next-generation reforms by reducing the GST burden.
I especially welcome the significant relief extended to the poor, middle… https://t.co/QvdtA1DpIa pic.twitter.com/qNqi7vkUit
— Pawan Kalyan (@PawanKalyan) September 4, 2025