Pawan Kalyan

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ కీలక ఆదేశాలు.. నామినేటెడ్ పదవులు వారికే ప్రాధాన్యం!

Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు కీలకమైన దిశానిర్దేశం చేశారు. మంగళగిరిలోని జనసేన కేంద్ర కార్యాలయంలో ముఖ్య నేతలతో సమావేశమైన అనంతరం ఆయన ఈ సూచనలు చేశారు. ప్రతి జనసేన నాయకుడు, కార్యకర్త తమ గ్రామ పంచాయతీ నుండి పార్లమెంట్ నియోజకవర్గం వరకూ జరిగే అభివృద్ధి కార్యక్రమాలలో చురుకుగా పాల్గొనాలని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. స్థానికంగా అవసరమైన రోడ్లు, నీరు వంటి మౌలిక సదుపాయాల కల్పనలో క్రియాశీలకంగా ఉండాలని ఆయన పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.

నామినేటెడ్ పదవుల భర్తీపై కీలక సూచనలు
రాష్ట్ర స్థాయిలో జనసేన పార్టీకి దక్కిన నామినేటెడ్ పదవుల వివరాలను పవన్ కళ్యాణ్ పరిశీలించారు. మిగిలిన పదవులను త్వరగా భర్తీ చేసేందుకు ఆయన ముఖ్యమైన సూచనలు చేశారు. కూటమి ధర్మాన్ని పాటించడంతో పాటు, పార్టీ కోసం నిజాయితీగా, కష్టపడి పని చేసిన వారికి మాత్రమే ఈ నామినేటెడ్ పదవులలో ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన ఆదేశించారు. వివిధ దశల్లో పార్టీకి సేవ చేసిన వారికి గుర్తింపు, బాధ్యతలను అందించేలా ఒక స్పష్టమైన కార్యాచరణను రూపొందించాలని నాయకులను కోరారు.

గ్రామ స్థాయి నుండి కమిటీల నిర్మాణం
పార్టీ నిర్మాణాన్ని బలోపేతం చేసేందుకు పవన్ కళ్యాణ్ కమిటీల ఏర్పాటుపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు. గ్రామ స్థాయి నుండి నియోజకవర్గం వరకూ పార్టీ కార్యక్రమాలను పర్యవేక్షించేందుకు అయిదుగురు సభ్యులతో కమిటీలను నియమించాలి. ఈ కమిటీ సభ్యులు కేవలం పార్టీ పనులే కాకుండా, స్థానికంగా అభివృద్ధి పనులు, మౌలిక సదుపాయాల కల్పనపై ప్రత్యేకంగా దృష్టి సారించాలి. దీనికి ఉదాహరణగా, ఇప్పటికే పిఠాపురం నియోజకవర్గంలో పైలట్ ప్రాజెక్ట్‌గా అయిదుగురు సభ్యులతో ఒక కమిటీ ఏర్పాటైందని, దాని పనితీరును అంచనా వేసి రాష్ట్రవ్యాప్తంగా అన్ని కమిటీలను రూపొందించాలని సూచించారు.

మహిళలకు రిజర్వేషన్, సమస్యల పరిష్కార విభాగం
పార్టీలో మహిళలకు ప్రాధాన్యం ఇవ్వాలని పవన్ కళ్యాణ్ గట్టిగా చెప్పారు. ప్రతి కమిటీలో తప్పనిసరిగా మహిళలకు స్థానం కల్పించాలి. అయిదుగురు సభ్యులు ఉండే కమిటీలో కనీసం ఒకరు లేదా గరిష్టంగా ఇద్దరు మహిళలు ఉండాలి. అదే విధంగా, 11 మంది సభ్యులు ఉండే కమిటీలో ముగ్గురు వీర మహిళలకు స్థానం ఇవ్వాలని నిర్ణయించారు. దీనితో పాటు, పార్టీ అంతర్గత వ్యవహారాలలో వచ్చే సమస్యలను పరిష్కరించేందుకు వీలుగా ‘కాన్ ఫ్లిక్ట్ మేనేజ్మెంట్’ విభాగాన్ని కేంద్ర కార్యాలయం నుండి పర్యవేక్షించాలని ఆదేశించారు. ఈ విభాగంలో 11 మంది సభ్యులను నియమించి, సమస్య ప్రాధాన్యం బట్టి ముగ్గురు లేదా మొత్తం సభ్యులు చర్చించి పరిష్కారం చూపాలని పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం చేశారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *