Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్‌లో తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా ప్రభుత్వం కీలక అడుగు వేసింది. జల జీవన్ మిషన్ (JJM) కింద చేపట్టిన భారీ వాటర్ గ్రిడ్ పథకానికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ శంకుస్థాపన చేశారు. ఈ పథకానికి అమరజీవి పొట్టి శ్రీరాములు పేరును పెట్టి ‘అమరజీవ జలధార’గా నామకరణం చేయడం విశేషంగా నిలిచింది.
ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, తెలుగు జాతి కోసం కూటమిగా అందరం ఏకమయ్యామని తెలిపారు. రాష్ట్ర విభజన తర్వాత పదేళ్ల పాటు ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడ్డారని, ఇకపై అలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా చూడాలన్నదే తమ లక్ష్యమన్నారు. ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందించేందుకు ప్రభుత్వం పూర్తి కట్టుబాటుతో పనిచేస్తోందని స్పష్టం చేశారు.
ఉమ్మడి తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో రూ.3,050 కోట్ల వ్యయంతో ఈ వాటర్ గ్రిడ్ ప్రాజెక్టును అమలు చేయనున్నట్లు వెల్లడించారు. ఈ ప్రాజెక్టు ద్వారా సుమారు 68 లక్షల కుటుంబాలకు తాగునీరు అందించాలన్నది లక్ష్యమని తెలిపారు. ఇక ఐదు జిల్లాల పరిధిలో మొత్తం వాటర్ గ్రిడ్ ప్రాజెక్టులపై రూ.7,910 కోట్లు ఖర్చు చేయనుండగా, దాదాపు 1.20 కోట్ల మందికి దాహార్తి తీర్చేలా ప్రణాళిక రూపొందించామని చెప్పారు. తీర ప్రాంతాలను ఎక్కువగా కలుపుతూ ఈ ప్రాజెక్టును డిజైన్ చేశామని, 2027 నాటికి పూర్తి చేయాలనే లక్ష్యంతో పనులు సాగుతున్నాయని తెలిపారు.
పొట్టి శ్రీరాములు గొప్పతనాన్ని గుర్తు చేస్తూ పవన్ భావోద్వేగంగా మాట్లాడారు. తెలుగువారికి ప్రత్యేక ఉనికిని తీసుకొచ్చిన వ్యక్తి పొట్టి శ్రీరాములని, ఆయన త్యాగాన్ని ఏ కులానికో లేదా ఏ జిల్లాకో పరిమితం చేయడం సరికాదన్నారు. వందల కులాల కోసం ఆయన ప్రాణత్యాగం చేశారని గుర్తుచేశారు. పొట్టి శ్రీరాములు మరణించిన తర్వాత ఆయన మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు కూడా ఎవరు లేకపోయారని, అప్పట్లో ఘంటసాల ముందుకొచ్చి అంత్యక్రియలు చేసిన ఘటనను ప్రస్తావించారు. తెలుగుజాతి, ఆత్మగౌరవం అనే భావనలకు మూల కారణం పొట్టి శ్రీరాములేనని స్పష్టం చేశారు.
Also Read: Imran Khan: పాకిస్థాన్ రాజకీయాల్లో సంచలనం: ఇమ్రాన్ ఖాన్, బుష్రా బీబీకి 17 ఏళ్ల శిక్ష
కులాల ప్రస్తావనపై స్పందిస్తూ, నాయకులకు కులాల ముద్రలు వేస్తే సమాజం కులాల సమూహంగానే మిగిలిపోతుందని, భారతీయులుగా ఎదగలేమని అన్నారు. కులం చూడకుండా ఆకలితో వచ్చిన వారికి అన్నం పెట్టిన డొక్కా సీతమ్మను గుర్తు చేస్తూ, ఉచిత మధ్యాహ్న భోజన పథకానికి ఆమె పేరు పెట్టడంపై సంతోషం వ్యక్తం చేశారు.
తన వ్యక్తిగత ఆలోచనల గురించి మాట్లాడిన పవన్, తాను ఎప్పుడూ క్రిమినల్స్‌ను, దోపిడీదారులను ఆరాధించలేదని, హక్కుల కోసం పోరాడిన వారినే ఆదర్శంగా తీసుకున్నానన్నారు. మనం ఎవరిని ఆరాధిస్తామో వారిలాగే తయారవుతామని వ్యాఖ్యానించారు. రాష్ట్రానికి, ప్రజలకు మేలు జరగాలనే తాను ఎప్పుడూ తగ్గి ఉంటానని, తనకు స్వార్థం లేదని చెప్పారు. కావాలంటే జీవితాంతం వాటర్ బాటిళ్లు పెట్టుకుని బతకవచ్చని, కానీ ప్రజల కోసం శాశ్వత పరిష్కారాలే అవసరమన్నారు.
గోదావరి జిల్లాల్లో కూడా ఒకప్పుడు నీటి కొరత వస్తుందని ఎప్పుడూ ఊహించలేదని పవన్ వ్యాఖ్యానించారు. అలాంటి పరిస్థితి రాకుండా ఉండేందుకే ఈ అమరజీవ జలధార వంటి పథకాలు అవసరమని స్పష్టం చేశారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే రాష్ట్రంలో తాగునీటి సమస్యకు గణనీయమైన పరిష్కారం లభిస్తుందని ప్రభుత్వం ఆశాభావం వ్యక్తం చేస్తోంది.
