Pawan Kalyan

Pawan Kalyan: కురుపాం గురుకుల పాఠశాలకు చెందిన ఇద్దరు విద్యార్థినుల మృతి బాధాకరం

Pawan Kalyan: పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం బాలికల గురుకుల పాఠశాలలో ఇద్దరు విద్యార్థినులు అనారోగ్యంతో మరణించిన ఘటనపై  ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తీవ్రంగా స్పందించారు. ఈ సంఘటన అత్యంత దురదృష్టకరమని, హృదయవిదారకమని పేర్కొన్నారు.

జిల్లా అధికారులు, వైద్యుల ద్వారా పాఠశాల పరిస్థితే కాక, విద్యార్థినుల అనారోగ్యానికి సంబంధించిన అన్ని వివరాలను తెలుసుకున్నట్లు పవన్ కల్యాణ్ వెల్లడించారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం, కొద్ది రోజులుగా పచ్చకామెర్ల లక్షణాలతో అనారోగ్యానికి గురైన ఇద్దరు విద్యార్థినులలో ఒకరు ఇంటి వద్ద, మరొకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ వేర్వేరు రోజుల్లో మరణించారు. ఈ విషయం తనను తీవ్రంగా కలచివేసిందని పవన్ తెలిపారు.

ఇది కూడా చదవండి: ACP Dead: ఏసీపీ మృతి.. పుష్ప టైం అల్లు అర్జున్ ని తిట్టింది ఇతనే

మరణించిన విద్యార్థినుల కుటుంబాలకు పవన్ కల్యాణ్ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ప్రస్తుతానికి అనారోగ్యంతో ఉన్న మరో 37 మంది విద్యార్థినులకు విశాఖపట్నంలోని కింగ్ జార్జ్ ఆసుపత్రి (కేజీహెచ్)లో అత్యుత్తమ వైద్యం అందిస్తున్నట్లు ఆయన తెలిపారు. వారి చికిత్సలో ఎలాంటి లోపం ఉండకూడదని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లు చెప్పారు.

విద్యార్థినుల ఆరోగ్య పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించేందుకు అదనపు వైద్య, ఆరోగ్య సిబ్బందిని నియమించాలని అధికారులను ఆదేశించినట్లు పవన్ కల్యాణ్ తెలిపారు. బాధిత బాలికలకు అత్యుత్తమ వైద్యం అందించే బాధ్యతను కూటమి ప్రభుత్వం పూర్తిగా తీసుకుంటుందని భరోసా ఇచ్చారు.

త్వరలోనే తాను స్వయంగా కురుపాం వెళ్లి గురుకుల పాఠశాలలోని పరిస్థితులను ప్రత్యక్షంగా పరిశీలిస్తానని పవన్ కల్యాణ్ హామీ ఇచ్చారు. “విద్యార్థినుల ఆరోగ్య భద్రత మా ప్రభుత్వానికి ప్రాధాన్యం. క్షేత్రస్థాయిలో పరిస్థితిని సమీక్షించి, అవసరమైన చర్యలు తప్పక తీసుకుంటాం” అని ఆయన స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *