OG Pre Release Business: ఇండస్ట్రీని షేక్ చేస్తోన్న ‘ఓజీ’.. పవన్ కెరీర్లో హయ్యెస్ట్ ప్రీ రిలీజ్ బిజినెస్
OG Pre Release Business: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులతో పాటు సినీ వర్గాలన్నీ ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా ‘OG’. దర్శకుడు సుజీత్ మాఫియా, గ్యాంగ్‌స్టర్ నేపథ్యంలో తెరకెక్కించిన ఈ చిత్రం, విడుదలకి ముందే బాక్సాఫీస్ వద్ద కొత్త చరిత్ర సృష్టిస్తోంది. పవన్ కెరీర్లో ఏ సినిమా సాధించని విధంగా ‘OG’ భారీ ప్రీ-రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ చేసింది, ఇది టాలీవుడ్‌ను ఆశ్చర్యానికి గురిచేసింది.
భారీ బిజినెస్ వెనుక ఉన్న కారణాలు
‘OG’ సినిమాపై భారీ అంచనాలు ఉండటానికి ప్రధాన కారణం దర్శకుడు మరియు ఫ్యాన్ బాయ్ సుజీత్ ఇంకా తమన్ మ్యూజిక్ . పవన్ కళ్యాణ్ అభిమానుల కోసమే ఈ చిత్రాన్ని రూపొందించడం, పవన్ కళ్యాణ్‌ని సరికొత్త గెటప్‌లో చూపించడం దీనికి ప్రధాన కారణాలు. గత సినిమాలతో పోలిస్తే, ‘OG’కి పాన్ ఇండియా స్థాయిలో చర్చ జరుగుతోంది. దీంతో ట్రేడ్ వర్గాల అంచనాలు తలకిందులయ్యాయి.
పవన్ గత చిత్రం ‘హరిహర వీరమల్లు’ ప్రీ-రిలీజ్ బిజినెస్ కేవలం రూ.126 కోట్లకు పరిమితమైతే, ‘OG’ ఏకంగా రూ.172 కోట్ల రికార్డును నెలకొల్పింది. ఇది ఈ రెండు సినిమాల మధ్య ఉన్న అంచనాలకు స్పష్టమైన రుజువు. ముఖ్యంగా, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ప్రతి ఏరియాలోనూ ‘OG’ హక్కులు భారీ ధరలకు అమ్ముడయ్యాయి.
ఇది కేవలం రాష్ట్రాల వారీగా ఉన్న వ్యత్యాసం మాత్రమే కాదు, విదేశీ మార్కెట్లోనూ ‘OG’ క్రేజ్ స్పష్టంగా కనిపించింది. ఓవర్సీస్ మార్కెట్లో ‘OG’ రూ.17.50 కోట్లు సాధిస్తే, ‘హరిహర వీరమల్లు’ కేవలం రూ.10 కోట్లతో సరిపెట్టుకుంది.
పవన్ కెరీర్ లోనే హైయెస్ట్ ప్రీ-రిలీజ్ బిజినెస్
పవన్ కళ్యాణ్ గత ఐదు సినిమాల ప్రీ-రిలీజ్ బిజినెస్‌తో పోలిస్తే ‘OG’ అగ్రస్థానంలో నిలిచింది. పవన్ 25వ సినిమా ‘అజ్ఞాతవాసి’ (రూ.123.60 కోట్లు), ‘కాటమరాయుడు’ (రూ.84.50 కోట్లు), ‘వకీల్ సాబ్’ (రూ.89.35 కోట్లు), ‘భీమ్లా నాయక్’ (రూ.106.75 కోట్లు), ‘బ్రో’ (రూ.97.50 కోట్లు) వంటి సినిమాల కంటే ‘OG’ (రూ.172 కోట్లు)తో చాలా ముందుంది.
ఈ భారీ బిజినెస్ చూస్తుంటే, సినిమా విడుదలైన మొదటి రోజునే రూ.125-140 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ సినిమా బ్రేక్ఈవెన్ సాధించడానికి దాదాపు రూ.340-350 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ అవసరం. దసరా సెలవులతో పాటు, అభిమానుల అంచనాలు అందుకుంటే సినిమా కేవలం 10 రోజుల్లోనే పెట్టుబడిని తిరిగి రాబట్టే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు చెబుతున్నారు.
మొత్తానికి, పవన్ క్రేజ్, సుజీత్ దర్శకత్వం, తమన్ మ్యూజిక్ మరియు పాన్ ఇండియా స్థాయిలో ఉన్న ఆసక్తి ‘OG’ సినిమాను విడుదలకి ముందే ఒక బ్లాక్‌బస్టర్‌గా నిలిపాయి. అభిమానుల కోసం సెప్టెంబర్ 24 రాత్రి నుంచి బెనిఫిట్ షోలు ఏర్పాటు చేయడంతో వారి ఆనందానికి హద్దులు లేవు.