Pawan Kalyan: ఉప ముఖ్యమంత్రి, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా నటించిన ‘హరిహర వీరమల్లు’ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా విశాఖపట్నంలోని ఏయూ కన్వెన్షన్ సెంటర్‌లో పెద్ద ఎత్తున ప్రీ-రిలీజ్ వేడుక జరిగింది. ఈ కార్యక్రమానికి పవన్ కల్యాణ్, హీరోయిన్ నిధి అగర్వాల్, ప్రముఖ సంగీత దర్శకుడు ఎం.ఎం. కీరవాణి హాజరయ్యారు. ఈ వేదికపై పవన్ కల్యాణ్ అభిమానులను ఉద్దేశించి చాలా ఆసక్తికర విషయాలు మాట్లాడారు.
పవన్ కల్యాణ్ తన ప్రసంగాన్ని “ఇక్కడికి ప్రతి ఒక్కరికీ నా హృదయపూర్వక నమస్కారాలు” అంటూ ప్రారంభించారు. తాను ఒక ప్రభుత్వ ఉద్యోగి కుమారుడినని, అందుకే చిన్నప్పటి నుంచి చాలా ఊర్లు తిరగాల్సి వచ్చిందని చెప్పారు. కానీ విశాఖపట్నం అంటే తనకెప్పుడూ ప్రత్యేకమైన ఇష్టమని, అది తన గుండెల్లో ఉంటుందని అన్నారు. గతంలో తాను నోవాటెల్ హోటల్ నుంచి బయటకు రాకుండా అడ్డుకున్నప్పుడు, విశాఖ మొత్తం వచ్చి తనకు మద్దతుగా నిలిచిందని గుర్తు చేసుకున్నారు. “నేను ఇప్పుడు ఉప ముఖ్యమంత్రిని. కానీ ఇక్కడ మీ అందరికీ ఇష్టమైన హీరోగా మాట్లాడుతాను” అని పవన్ అన్నారు.
గత ప్రభుత్వ హయాంలో తమ ‘బీమ్లా నాయక్’ సినిమాకు టికెట్ ధరలు రూ.10-15కి తగ్గించి చాలా ఇబ్బందులు పెట్టారని, అయినా ప్రేక్షకులు ఆ సినిమాను పెద్ద హిట్ చేశారని పవన్ ధన్యవాదాలు తెలిపారు. ‘హరిహర వీరమల్లు’ సినిమా పెద్ద విజయం సాధించాలని ట్వీట్ చేసిన మంత్రి నారా లోకేష్‌కు ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్పారు.
“నా సినిమా చూడండి అని చెప్పడానికి నాకు చాలా సిగ్గుగా ఉంటుంది. ఓటు వేయమని అడగడానికి ఎంత ఇబ్బంది పడతానో, సినిమా చూడమని అడగడమూ అంతే ఇబ్బంది” అని పవన్ అన్నారు. తనకు ఎప్పుడూ ఇతరులకు ఇవ్వడమే తెలుసు కానీ, అడగడం తెలియదని చెప్పారు. తాను అడగకపోయినా ప్రజలు తనకు అండగా ఉంటారని నమ్ముతానని అన్నారు.
Also Read: Nadendla Manohar: పీ4 ద్వారా పేదరిక నిర్మూలనకు రాష్ట్రం ముందడుగు
చిన్నప్పటి నుంచి హీరో అవ్వాలని, డబ్బు సంపాదించాలని తనకు పెద్దగా కోరికలు లేవని పవన్ స్పష్టం చేశారు. అన్యాయం జరిగినప్పుడు దానిపై పోరాడటం, ఇతరులకు సహాయం చేయడమే తన స్వభావమని చెప్పారు. నటన నేర్చుకునేటప్పుడు “సరస్వతి నమస్తుభ్యం” ప్రార్థనతో మొదలుపెట్టానని, సత్యానంద్ గారి వద్ద నటనతో పాటు జీవిత పాఠాలు, ముఖ్యంగా ధైర్యాన్ని నేర్చుకున్నానని తెలిపారు.
“ఇంకో ఏడాది అయితే నాకు కూడా 30 ఏళ్ల సినీ అనుభవం అని చెప్పుకోవచ్చు” అని పవన్ నవ్వుతూ అన్నారు. ‘ఖుషి’ వంటి పెద్ద హిట్ ఇచ్చిన ఏ.ఎం. రత్నం గారికి ధన్యవాదాలు చెప్పారు. ముఖ్యంగా ‘హరిహర వీరమల్లు’ సినిమా గురించి మాట్లాడుతూ, దర్శకుడు క్రిష్ ఈ సినిమాకు మూల కారణమని, 30-40 శాతం సినిమాను క్రిష్ పూర్తి చేశారని, ఆయనకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు అని చెప్పారు. మిగిలిన సినిమాను ఏ.ఎం. రత్నం గారి కుమారుడు జ్యోతికృష్ణ పూర్తి చేశారని తెలిపారు.
ఏ సినిమా ఎంత పెద్ద రికార్డులు సృష్టిస్తుందో మనకు తెలియదని, కర్మ చేయడమే మన పని అని, ఫలితాన్ని దేవుడికి వదిలేయాలని పవన్ అన్నారు. సినిమా ఎంత బాగా తీసినా, అందులోని ఎమోషన్స్ ప్రేక్షకులను కదిలించగలగాలని అభిప్రాయపడ్డారు. “సంగీత దర్శకుడు కీరవాణి లేకపోతే ‘హరిహర వీరమల్లు’ సినిమా లేదు” అని చెప్పి, కీరవాణి పాత్ర ఎంత కీలకమో వివరించారు. ఈ సినిమా భారీ విజయం సాధించాలని అభిమానులు ఆశిస్తున్నారు.