Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన వ్యక్తిత్వ హక్కుల పరిరక్షణ కోసం ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. సోషల్ మీడియాలో తన గురించి అసత్యాలు, అభ్యంతరకర పోస్టులు పెడుతున్నారని, అవి తన వ్యక్తిగత హక్కులను ఉల్లంఘిస్తున్నాయని ఆయన కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన ఢిల్లీ హైకోర్టు, సోషల్ మీడియా సంస్థలకు కీలక ఆదేశాలు జారీ చేసింది. పవన్ కళ్యాణ్ లాంటి ప్రజా నాయకుడి వ్యక్తిగత హక్కులను కాపాడటం చాలా ముఖ్యమని కోర్టు స్పష్టం చేసింది.
పవన్ కళ్యాణ్ తరపు న్యాయవాది కోర్టులో మాట్లాడుతూ, సోషల్ మీడియా వేదికల్లో ఉప ముఖ్యమంత్రి వ్యక్తిత్వ హక్కులకు భంగం కలిగించేలా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోందని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. దీనిని పరిశీలించిన హైకోర్టు, ఈ సమస్యపై తక్షణ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది. వ్యక్తిత్వ హక్కులను ఉల్లంఘిస్తున్న సోషల్ మీడియా అకౌంట్లపై వారం రోజుల్లోగా చర్యలు తీసుకోవాలని ట్విట్టర్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ వంటి అన్ని సోషల్ మీడియా సంస్థలను ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది.
ఈ విషయంలో తగిన చర్యలు తీసుకోవడానికి వీలుగా, పవన్ కళ్యాణ్ తరపు న్యాయవాది రెండు రోజుల్లోగా హక్కుల ఉల్లంఘనకు సంబంధించిన పూర్తి వివరాలు అంటే ఆ పోస్టుల లింక్‌లు, స్క్రీన్‌షాట్‌లు, అకౌంట్ వివరాలు వంటి సమాచారాన్ని సోషల్ మీడియా సంస్థలకు అందించాలని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ వివరాలు అందిన వెంటనే, ఆయా కంపెనీలు ఎలాంటి ఆలస్యం చేయకుండా సముచిత చర్యలు తీసుకోవాలని కోర్టు ఆదేశించింది. ఈ కేసు తదుపరి విచారణను డిసెంబర్ 22వ తేదీకి వాయిదా వేసింది.
