Red Gravel: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చర్యలతో ఏలూరు జిల్లాలో జరిగిన భారీ అక్రమ మైనింగ్ బయట పడింది. ఏలూరు జిల్లా ద్వారక తిరుమల మండలం ఐ.ఎస్.జగన్నాథ పురంలో భారీ స్థాయిలో రెడ్ గ్రావెల్ అక్రమ త్రవ్వకాలు జరిగినట్లు జిల్లా అధికారులు నిర్ధారించారు. ఇటీవల ఏలూరు జిల్లాలో పర్యటించిన డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ రెడ్ గ్రావెల్ అక్రమ తవ్వకాలపై విచారణ చేసి నివేదిక సమర్పించాలని అధికారులను ఆదేశించారు . దీంతో రంగంలోకి దిగిన అధికారులు, బెకెం ఇన్ఫ్రా సంస్థ అనుమతులు లేకుండా దాదాపు 20ఎకరాల్లో మైనింగ్ చేసి 6లక్షల క్యూబిక్ మీటర్లు రెడ్ గ్రావెల్ అక్రమంగా త్రవ్వకాలు జరిగినట్టు నిర్దారణ చేసి, నివేదికను ఉపముఖ్యమంత్రి కార్యాలయానికి సైతం అందజేశారు. అక్రమ మైనింగ్ వ్యవహారంపై బాధ్యులైన ప్రతి ఒక్కరిపై చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వ యంత్రాంగం సిద్దం అవుతుంది.
