Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మరోసారి తన పెద్ద మనసును చాటుకున్నారు. ఇటీవల ఆయన ‘ఓజీ’ సినిమా దర్శకుడు సుజీత్కు ఖరీదైన ల్యాండ్ రోవర్ డిఫెండర్ కారును బహుమతిగా ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే, ఈ గిఫ్ట్ వెనుక ఉన్న అసలు కారణం తాజాగా వెలుగులోకి వచ్చింది.
చాలామంది ఈ బహుమతిని ‘ఓజీ’ సినిమా విజయం కారణంగా ఇచ్చినదిగా భావించారు. కానీ, వాస్తవం మాత్రం దర్శకుడు సుజీత్ సినిమాపై చూపిన అంకితభావంతో ముడిపడి ఉంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం, ‘ఓజీ’ చిత్ర చివరి దశలో జపాన్‌లో కీలకమైన షెడ్యూల్ చిత్రీకరణ అవసరం ఏర్పడింది. అయితే, బడ్జెట్ పరిమితుల వల్ల నిర్మాతలు ఆ షెడ్యూల్‌కు అంగీకరించలేదు.
అయినా, ఆ సన్నివేశాలు కథకు ఎంతో కీలకమని భావించిన సుజీత్, ఎలాంటి రాజీ పడకుండా ముందడుగు వేశారు. జపాన్ షెడ్యూల్ పూర్తి చేయడానికి తన సొంత ల్యాండ్ రోవర్ డిఫెండర్ కారునే అమ్మేసి, ఆ డబ్బుతో చిత్ర యూనిట్‌ను అక్కడికి తీసుకెళ్లి కీలక సన్నివేశాలను చిత్రీకరించారు.
ఈ విషయం డబ్బింగ్ దశలో పవన్ కల్యాణ్‌కు తెలియడంతో ఆయన తీవ్రంగా స్పందించారు. సినిమా కోసం దర్శకుడు చూపిన తపన, బాధ్యత, నిబద్ధత చూసి పవన్ చలించిపోయారు. సుజీత్ చేసిన త్యాగానికి గౌరవంగా, అతను సినిమా కోసం అమ్ముకున్న అదే మోడల్ కారును తిరిగి బహుమతిగా ఇవ్వాలని నిర్ణయించుకున్నారు.
అందుకే, కొత్త ల్యాండ్ రోవర్ డిఫెండర్ కారును కొనుగోలు చేసి, సుజీత్‌కు పవన్ కల్యాణ్ అందజేశారు. ఈ సంఘటన టాలీవుడ్‌లో ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. పవన్ కల్యాణ్ తన సహచరుల అంకితభావాన్ని ఎంత విలువగా భావిస్తారో చెప్పడానికి ఇదొక చక్కటి ఉదాహరణగా సినీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
