Pawan Kalyan: రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మరియు పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ అధికారులు నిబంధనలకు లోబడి మాత్రమే పని చేయాలని స్పష్టం చేశారు. తన వైపు నుంచి ఎలాంటి రాజకీయ సిఫార్సులు లేదా ఒత్తిడులు ఉండవని, కష్టపడి పనిచేసే అధికారులకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని తెలిపారు. పనిలో అలసత్వం లేదా నిర్లక్ష్యం ఉంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
విశాఖపట్నం కలెక్టరేట్‌లో ఉత్తరాంధ్ర జిల్లాల పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, ఆర్‌డబ్ల్యూఎస్, ఇంజినీరింగ్ శాఖల అధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఉపాధి హామీ పథకం, పల్లెపండగ 1.0, 2.0, జల్ జీవన్ మిషన్ వంటి పథకాల పురోగతిపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. లక్ష్యాలను ఎందుకు పూర్తి చేయలేకపోయారనే అంశంపై అధికారుల నుంచి వివరణ కోరారు.
పవన్ కళ్యాణ్ గత ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. గత ప్రభుత్వం పంచాయతీరాజ్ వ్యవస్థను నిర్వీర్యం చేసి వేల కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిందని ఆరోపించారు. జల్ జీవన్ మిషన్ లక్ష్యాలను నీరుగార్చి రూ.4 వేల కోట్ల దుర్వినియోగం చేశారని, పనులు చేసినట్టు రికార్డులు సృష్టించినప్పటికీ ప్రజలకు నీరు అందలేదని విమర్శించారు.
ప్రస్తుత కూటమి ప్రభుత్వం ప్రజల సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తోందని పవన్ తెలిపారు. పంచాయతీరాజ్ శాఖను బలోపేతం చేయడానికి సంస్కరణలు అమలు చేస్తున్నామని, పెండింగ్‌లో ఉన్న 10 వేల ప్రమోషన్లను ప్రలోభాలకు లోబడకుండా పూర్తి చేశామని చెప్పారు. ఉద్యోగులకు ఎలాంటి కష్టం వచ్చినా ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.
