Pattabhiram: తిరుపతిలో భూమన కరుణాకర్ రెడ్డి, ఆయన కుమారుడు అభినయ్ రెడ్డి అక్రమాలకు పాల్పడుతున్నారని స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఛైర్మన్ పట్టాభి రామ్ తీవ్ర ఆరోపణలు చేశారు. ఇటీవల దళిత యువకుడు పవన్‌పై జరిగిన దాడి, కిడ్నాప్ ఘటనను ప్రస్తావిస్తూ వైఎస్సార్‌సీపీ నాయకులను ఆయన తీవ్రంగా విమర్శించారు. తిరుపతిలో ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పట్టాభి ఈ వ్యాఖ్యలు చేశారు.
భూమన అభినయ్ రెడ్డి అనుచరులైన అనిల్ రెడ్డి, జగదీష్ రెడ్డి దళిత యువకుడు పవన్‌ను కిడ్నాప్ చేసి చిత్రహింసలకు గురిచేశారని పట్టాభి తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు బయటకు వచ్చిన తర్వాత, పవన్‌ను బెదిరించి, తన సోదరుడే కొట్టాడని బలవంతంగా తప్పుడు వాంగ్మూలం ఇప్పించారని ఆరోపించారు. ఈ ఘటనను ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేశ్ తీవ్రంగా పరిగణించి, పవన్‌ను కిడ్నాప్ చెర నుంచి విడిపించారని, దాడిలో పాల్గొన్న నిందితులను అరెస్టు చేశారని ఆయన వివరించారు. ఈ దారుణానికి కారకులైన భూమన కరుణాకర్ రెడ్డి, ఆయన కుమారుడు అభినయ్ రెడ్డిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని పట్టాభిరామ్ స్పష్టం చేశారు.
Also Read: Guvvala Balaraju: కాషాయ కండువా కప్పుకున్న గువ్వల బాలరాజు
పట్టాభిరామ్ భూమన కరుణాకర్ రెడ్డి అక్రమాస్తులపై కూడా పలు ప్రశ్నలు సంధించారు. స్వర్ణముఖి నది ప్రాంతంలో ఏకంగా 9 ఎకరాల భూమిని కబ్జా చేశారని ఆరోపించారు. “ఒక జిరాక్స్ మెషీన్‌తో జీవితం ప్రారంభించిన భూమన, నేడు వేల కోట్లకు ఎలా అధిపతి అయ్యారు?” అని ప్రశ్నించారు. పట్టాభిరామ్ మాట్లాడుతూ, భూమన కరుణాకర్ రెడ్డి టీటీడీ, తుడా ఛైర్మన్‌గా ఉన్న కాలంలో 21 ఆస్తులను తన కుటుంబ సభ్యుల పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించారని ఆరోపించారు. ఆ సమయంలో అంత పెద్ద మొత్తంలో ఆస్తులు కొనడానికి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయో చెప్పాలని ఆయన నిలదీశారు. వైఎస్సార్‌సీపీ నాయకులు మనిషి రూపంలో ఉన్న మానవ మృగాలు అని పట్టాభి ఘాటుగా విమర్శించారు.