Congress

Congress: మోడీ తల్లి వీడియో డిలీట్ చేయండి.. కాంగ్రెస్ కి పాట్నా కోర్టు ఆర్డర్..

Congress: ప్రధాని నరేంద్ర మోడీ 75వ పుట్టినరోజు రోజున కాంగ్రెస్ పార్టీకి ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. బీహార్ కాంగ్రెస్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఏఐతో సృష్టించిన వీడియో దేశవ్యాప్తంగా పెద్ద వివాదానికి దారితీసింది. ఈ వీడియోలో మోడీ నిద్రపోతున్న సమయంలో తన తల్లి హీరాబెన్ కలలోకి వచ్చి  ప్రస్తుత రాజకీయాలపై విమర్శించినట్లు చూపించడంతో బీజేపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.

ఈ నేపథ్యంలో బుధవారం విచారణ చేపట్టిన పాట్నా హైకోర్టు చీఫ్ జస్టిస్ పీబీ బజంత్రీ కీలక తీర్పు ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీ తక్షణమే వీడియోను అన్ని సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌ల నుంచి తొలగించాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.

ఏం ఉంది వీడియోలో?

బీహార్ ఎన్నికల వేడిలో భాగంగా కాంగ్రెస్ రూపొందించిన ఈ వీడియోలో మోడీని పోలిన పాత్ర రాత్రి ఇంటికి చేరి, ఓట్లు చోరీ చేశానని అనుకుంటూ నిద్రలోకి జారుకుంటాడు. అప్పుడు కలలో ఆయన తల్లి హీరాబెన్ ప్రత్యక్షమై కుమారునిపై ప్రశ్నలు లేవనెట్టి మందలిస్తారు. నువ్వు ఎంతవరకు తగ్గడానికి సిద్ధంగా ఉన్నావు?’’ అని అడుగుతుండగా మోడీని పోలిన పాత్ర ఒక్కసారిగా మేల్కొంటుంది.

కాంగ్రెస్ ఎక్స్ ఖాతా ద్వారా ఈ వీడియోను “సాహబ్ కే సప్నో మే ఆయీ మా” అనే శీర్షికతో పోస్ట్ చేసింది.

బీజేపీ ఆగ్రహం – మిత్రపక్షాల విమర్శలు

ఈ వీడియోపై బీజేపీ మండిపడింది. “ప్రధాని దివంగత తల్లిని లక్ష్యంగా చేసుకుని ఇంత చౌకబారు రాజకీయాలు చేస్తారా? ఇది కాంగ్రెస్ దిగజారుడుతనానికి నిదర్శనం” అని బీజేపీ సీనియర్ నేత రవిశంకర్ ప్రసాద్ తీవ్రంగా ప్రశ్నించారు.

ఇది కూడా చదవండి: Dasara Halidays: తెలుగు రాష్ట్రాల విద్యార్థుల‌కు పండుగే పండుగ‌.. ద‌స‌రా సెల‌వులు ఈ రోజుల్లోనే..

అంతేకాక జేడీయూ, ఎల్జేపీ వంటి ఎన్డీఏ మిత్రపక్షాలు కూడా కాంగ్రెస్ వైఖరిని ఖండించాయి. “ఇది ఒక తల్లికి మాత్రమే కాదు, ప్రతి తల్లికి అవమానం” అని జేడీయూ వర్కింగ్ ప్రెసిడెంట్ సంజయ్ కుమార్ ఝా వ్యాఖ్యానించారు.

కాంగ్రెస్ సమర్థన

ఇక కాంగ్రెస్ మాత్రం వీడియోను సమర్థించుకుంది. “ఎటువంటి అవమానం జరగలేదు. ఒక తల్లి తన కుమారుడిని సరికొత్త మార్గంలో నడిపించడానికి ప్రయత్నించిందని చూపించాం. ఇక్కడ ఎవరినీ అవమానించలేదు” అని కాంగ్రెస్ మీడియా ఇన్‌ఛార్జ్ పవన్ ఖేరా స్పష్టం చేశారు.

రాజకీయ దుమారం

బీహార్‌లో ఇప్పటికే ఎన్నికల జ్వరం చెలరేగుతున్న వేళ ఈ ఏఐ వీడియో మరింత చర్చనీయాంశంగా మారింది. ఓట్ల చోరీ ఆరోపణలు, బీజేపీ-కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం, హైకోర్టు ఆదేశాలు. అన్నీ కలిసిపోవడంతో ఈ వివాదం ఇంకా కొన్ని రోజులు రాజకీయ వాతావరణాన్ని వేడెక్కించేలా కనిపిస్తోంది.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *