Turkish Airlines: గాల్లో ప్రయాణిస్తున్న విమానంలో ఓ వ్యక్తి మరణిస్తే.. ఆ మృతదేహం అదృశ్యమైతే? అవును, సరిగ్గా ఇలాంటి వింత ఘటనే చోటుచేసుకుంది. శాన్‌ఫ్రాన్సిస్కోకు వెళ్తున్న తుర్కిష్ ఎయిర్‌లైన్స్ విమానంలో మృతిచెందిన ఓ ప్రయాణికుడి మృతదేహం షికాగో విమానాశ్రయంలో ల్యాండ్ అయిన తర్వాత కనిపించకుండా పోవడం కలకలం రేపింది. ఈ ఘటనపై అధికారులు దర్యాప్తు ప్రారంభించారు.
అసలేం జరిగింది?
ఈ నెల 13న (జూలై 13, 2025) తుర్కిష్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన TK79 విమానం ఇస్తాంబుల్ నుంచి శాన్‌ఫ్రాన్సిస్కోకు బయలుదేరింది. విమానం గాల్లో ఉండగానే ఒక ప్రయాణికుడు అస్వస్థతకు గురై దురదృష్టవశాత్తు మరణించాడు.
ఈ విషయాన్ని తెలుసుకున్న విమాన సిబ్బంది, అత్యవసరంగా విమానాన్ని ఐస్లాండ్‌లోని కెఫ్లావిక్ విమానాశ్రయానికి మళ్లించాలని మొదట అనుకున్నారు. అయితే, అక్కడ అనుమతులు లభించకపోవడంతో విమానాన్ని అమెరికాలోని షికాగోలోని ఓ’హారే అంతర్జాతీయ విమానాశ్రయానికి మళ్లించి అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు.
Also Read: Hulk Hogan: ప్రముఖ రెజ్లర్ హల్క్ హోగన్ కన్నుమూత
మృతదేహం మాయం?
విమాన సిబ్బంది, మృతిచెందిన ప్రయాణికుడి మృతదేహాన్ని షికాగోలోని కుక్ కౌంటీ మెడికల్ ఎగ్జామినర్ కార్యాలయానికి అప్పగించినట్లు పేర్కొన్నారు. మిగిలిన ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా వెంటనే ప్రత్యామ్నాయ విమాన ఏర్పాట్లు కూడా చేశారు.
అయితే, అసలు సమస్య ఇక్కడే మొదలైంది. మెడికల్ ఎగ్జామినర్ కార్యాలయ ప్రతినిధి నటాలియా డెరెవ్యానీ మాట్లాడుతూ, తమకు తుర్కిష్ ఎయిర్‌లైన్స్ నుంచి ఎలాంటి మృతదేహం అందలేదని స్పష్టం చేశారు. దీంతో మృతదేహం ఎక్కడ మాయమైందనే ప్రశ్న తలెత్తింది.
విమానం షికాగోలో అత్యవసర ల్యాండింగ్ అయిన తర్వాత మృతదేహానికి ఏమైందనే దానిపై అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. మృతిచెందిన ప్రయాణికుడికి సంబంధించిన వివరాలను కూడా తుర్కిష్ విమానయాన సంస్థ ఇంకా వెల్లడించలేదు. ఈ సంఘటనపై పూర్తిస్థాయి విచారణ జరుగుతోంది.