Sigachi Company: సంగారెడ్డి జిల్లాలోని పాశమైలారం పరిశ్రమలో జరిగిన భారీ పేలుడు దేశవ్యాప్తంగా కలకలం రేపింది. ఈ దుర్ఘటనపై సిగాచీ పరిశ్రమ మొదటిసారి స్పందించింది. కంపెనీ తరఫున సెక్రటరీ వివేక్ మీడియాతో మాట్లాడారు.
ఈ ప్రమాదంలో 40 మంది మృతి చెందారని, 33 మందికి గాయాలు అయ్యాయని ఆయన తెలిపారు. మృతుల కుటుంబాలకు రూ. కోటి చొప్పున పరిహారం ఇస్తామని, గాయపడిన వారికి పూర్తి వైద్య సాయం అందిస్తామని చెప్పారు. బాధితులకు అన్ని విధాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు.
ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం కూడా మృతుల కుటుంబాలకు కోటి రూపాయల పరిహారం ప్రకటించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా పరిస్థితిని సమీక్షిస్తూ, మంత్రులతో కలిసి ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు.
ఇప్పటివరకు 18 మృతదేహాలు గుర్తించగా, వాటిలో 16 మృతదేహాలు కుటుంబ సభ్యులకు అప్పగించారు. మిగతా మృతదేహాల గుర్తింపు కోసం డీఎన్‌ఏ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇంకా 11 మంది ఆచూకీ లభించలేదు.
ఇది కూడా చదవండి: Women’s Commission: జూలై 4న రాష్ట్ర మహిళా కమిషన్ ఎదుట విచారణకు ఫిరోజ్‌ఖాన్ రావాలని ఆదేశం
ఇదిలా ఉండగా, సిగాచీ కంపెనీ స్టాక్ మార్కెట్లకు లేఖ రాసింది. ఈ ప్రమాదానికి రియాక్టర్ పేలుడు కారణం కాదని, దీనిపై ప్రభుత్వ విచారణ ఫలితాలను ఎదురుచూస్తున్నామని తెలిపింది. మూడు నెలల పాటు పరిశ్రమ కార్యకలాపాలను నిలిపివేస్తామని కంపెనీ ప్రకటించింది.
ఈ ప్రమాదంతో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ప్రభుత్వం, కంపెనీ తరఫున సాయం అందించడం కొంత తృప్తికరమైన విషయమే అయినప్పటికీ, ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా పరిశ్రమలపై మరింత నిఘా అవసరం అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.