Parthasarathi: పరకామణి చోరీ కేసులో ఫిర్యాదుదారుడు, గుంతకల్లు రైల్వే ఆర్మ్డ్ రిజర్వ్ సీఐ సతీశ్ కుమార్ అనుమానాస్పద మృతిపై వైసీపీ నాయకులు చూపుతున్న అసాధారణ ఉత్సాహాన్ని మంత్రి పార్థసారథి ప్రశ్నించారు. పరకామణి చోరీ కేసులో నిజాలు వెలుగులోకి వచ్చే భయంతోనే “ఆత్మహత్య” అని వైసీపీ నేతలు ప్రచారం చేస్తున్నారని ఆయన విమర్శించారు.
సతీశ్ కుమార్ టీటీడీలో పనిచేసే సమయంలోనే చోరీ జరిగిన విషయం గుర్తుచేస్తూ, ఆయన ఇప్పటికే విచారణలో వాగ్మూలం ఇచ్చారని మంత్రి తెలిపారు. నిజాలు బయటపెడతారన్న భయంతో సతీశ్‌ను హత్య చేసి ఉండే అవకాశం ఉందని పార్థసారథి అనుమానం వ్యక్తం చేశారు.
వైఎస్ వివేకానందరెడ్డి హత్య సందర్భంగా కూడా మొదట గుండెపోటు కథనమే వైరల్ చేశారని గుర్తుచేస్తూ, ఇప్పుడు కూడా అదే తరహాలో “ఆత్మహత్య” ప్రచారం సాగుతోందని ఆయన అన్నారు. పోలీసు దర్యాప్తు పూర్తికాకముందే ఆత్మహత్య అని ఎలా తేల్చగలిగారని ప్రశ్నించారు.
సతీశ్‌తో ప్రయాణించేలా తమ వ్యక్తులను వైసీపీ పంపిందేమో అన్న అనుమానాన్ని కూడా మంత్రి వ్యక్తం చేశారు. సతీశ్ మరణంతో వైసీపీకి సంబంధం ఏమిటి? ఎందుకు ఇంత ఉత్సాహం చూపుతున్నారని ఆయన నిలదీశారు.
గత ప్రభుత్వం టీటీడీ పరువు తీసిందని, భక్తులకు పంపిణీ చేసే లడ్డూల్లో కూడా కల్తీ జరిగిందని మంత్రి పార్థసారథి తీవ్ర విమర్శలు చేశారు.

