Parliament: బీజేపీ అగ్రనేత, కేంద్ర మంత్రి అమిత్‌షా వ్యాఖ్యలు తీవ్ర దుమారం లేపుతున్నాయి. నిన్నటి నుంచి అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య చోటుచేసుకున్న వాగ్వాదం.. నేడు తోపులాట వరకూ దారితీసింది. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్‌ను అవమానించేలా అమిత్ షా చేసిన వ్యాఖ్యలు చేశారని, దానికి నిరసనగా లోక్‌సభ సమావేశాలు ప్రారంభం కాకముందే ఇండియా కూటమి సభ్యులు తీవ్ర నిరసనకు దిగారు. గందరగోళ పరిస్థితుల కారణంగా గురువారం నాటి లోక్‌సభ, రాజ్యసభ సమావేశాలు వాయిదా పడ్డాయి.
Parliament: అంతకు ముందు సభకు వెళ్తున్న అధికార పక్ష సభ్యులను విపక్ష ఇండియా కూటమి సభ్యులు అడ్డుకున్నారు. అమిత్ షాను మంత్రివర్గం నుంచి తొలగించాలని, క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు. ఈ సమయంలో ఇరువర్గాల నడుమ తీవ్ర వాగ్వాదం.. తోపులాటకు దారితీసింది. పోటాపోటీ నినాదాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకున్నది.
Parliament: తోపులాట సమయంలో ఒడిశాకు చెందిన బీజేపీ ఎంపీ సారంగి కిందపడిపోయాడు. ఆయన తలకు గాయాలవడంతో ఆసుపత్రికి తరలించారు. ఇదిలా ఉండగా రాహుల్‌గాంధీ తోయడంతోనే తాను కిందపడి గాయాలపాలైనట్టు బీజేపీ ఎంపీ సారంగి ఆరోపించారు. ఈ ఆరోపణలను రాహుల్‌గాంధీ తోసిపుచ్చారు. తాను వెళ్తుంటే బీజేపీ సభ్యులే తనను నెట్టివేశారని, ఒక దశలో బెదిరించారని రాహుల్ ఆరోపించారు. తమ పార్టీ నేత ఖర్గేను కూడా నెట్టేశారని తెలిపారు. ఘటన మొత్తం సీసీ కెమెరాలో రికార్డు అయి ఉంటుందని తెలిపారు.
Parliament: అమిత్ షా వ్యాఖ్యలకు నిరసనగా ఇండియా కూటమి ఎంపీలు నీలపురంగు దుస్తులు, కండువాలతో ఆందోళనకు దిగారు. అంబేద్కర్ ప్లకార్డులను పట్టకొని రాహుల్‌గాంధీ, ప్రియాంక, ఇతర ఎంపీలు పార్లమెంటు ఆవరణలోని అంబేద్కర్ విగ్రహం వద్ద ఆందోళన నిర్వహించారు. జైభీమ్ అంటూ నినదించారు. అమిత్‌షా రాజీనామాకు, క్షమాపణలు చెప్పాలని పట్టుబట్టారు.
