Parliament Budget Sessions

Parliament Budget Sessions: జనవరి 31 నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం

Parliament Budget Sessions:  దేశ చరిత్రలోనే అత్యంత కీలకమైన పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ఈ నెల 31 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ విడత సమావేశాలు కేవలం బడ్జెట్ పరంగానే కాకుండా, దేశ రాజకీయ ముఖచిత్రాన్ని మార్చేసే కీలక బిల్లుల చర్చా వేదికగా నిలవబోతున్నాయి. జనవరి 31వ తేదీన ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేసే ప్రసంగంతో ఈ సమావేశాలు అధికారికంగా మొదలవుతాయి. అదే రోజున ప్రభుత్వం ఆర్థిక సర్వేను కూడా సభ ముందు ఉంచే అవకాశం ఉంది.

ఈసారి బడ్జెట్ సమావేశాల్లో ఒక అరుదైన ఘట్టం చోటుచేసుకోబోతోంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1వ తేదీన వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. సాధారణంగా ఆదివారం సెలవు దినం అయినప్పటికీ, బడ్జెట్ తేదీని మార్చకుండా అదే రోజున ప్రవేశపెట్టాలని కేంద్రం నిర్ణయించడం విశేషం. ఇలా ఆదివారం బడ్జెట్ ప్రవేశపెట్టడం దేశ చరిత్రలో ఇదే తొలిసారి. ముఖ్యంగా ఏప్రిల్ 1, 2026 నుంచి అమల్లోకి రానున్న కొత్త ‘ఆదాయపు పన్ను చట్టం-2025’ నేపథ్యంలో, ఈ బడ్జెట్‌లో సామాన్యులకు పన్ను రాయితీలు, మధ్యతరగతి వారికి ఊరటనిచ్చే ప్రకటనలు ఉంటాయని భారీ అంచనాలు నెలకొన్నాయి.

Also Read: Sankranti 2026: సంక్రాంతికి ఊళ్ల‌కు వెళ్తున్నారా? ఇవి త‌ప్ప‌క పాటించండి! పోలీస్ శాఖ‌ హెచ్చ‌రిక‌

బడ్జెట్ మాత్రమే కాకుండా, ఈ సమావేశాల్లో కొన్ని సంచలన బిల్లులు కూడా సభ ముందుకు రానున్నాయి. దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు నిర్వహించే ‘వన్ నేషన్–వన్ ఎలక్షన్’ బిల్లుపై (రాజ్యాంగ 129వ సవరణ బిల్లు) ఈసారి లోతైన చర్చ జరగనుంది. దీనితో పాటు, జైలులో ఉండి పాలన సాగించే సంస్కృతికి చెక్ పెట్టేలా ‘రాజ్యాంగ 130వ సవరణ బిల్లు’ను కూడా ప్రభుత్వం కీలకంగా భావిస్తోంది. ఈ బిల్లు ప్రకారం.. ఎవరైనా ముఖ్యమంత్రి లేదా మంత్రి వరుసగా 30 రోజుల పాటు జైలులో ఉంటే, వారు తమ పదవుల నుండి తానంతట తానుగా(Automatically) తొలగించబడతారు. ఈ ప్రతిపాదనలు చట్టరూపం దాల్చితే భారత ప్రజాస్వామ్య వ్యవస్థలో భారీ మార్పులు వస్తాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

ఈ సమావేశాలు రెండు విడతలుగా జరగనున్నాయి. తొలి విడత జనవరి 31 నుంచి ఫిబ్రవరి 13 వరకు, రెండో విడత మార్చి 10 నుంచి ఏప్రిల్ 4 వరకు కొనసాగుతాయి. దేశ భవిష్యత్తును నిర్ణయించే ఈ కీలక సమావేశాలపై ప్రస్తుతం అందరి దృష్టి నెలకొంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *