Palakurthy: పాలకుర్తి అసెంబ్లీ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు తారస్థాయికి చేరుకున్నాయి. నియోజకవర్గంలో అడుగడుగునా ఇటు ఎమ్మెల్యే వర్గం, అటు అసమ్మతి వర్గం కీచులాటలతో పార్టీ బలహీనపడింది. వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో అది మరింత దిగజారుతుందని విశ్లేషకులు సైతం అంచనా వేస్తున్నారు.
Palakurthy: పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వినీరెడ్డి, ఆమె అత్త ఝాన్సీరెడ్డిని అసమ్మతి వాదులు తొలినాళ్ల నుంచి వ్యతిరేకిస్తూ వస్తున్నారు. వారి ఆధిపత్యాన్ని ప్రశ్నిస్తూ, పలు సందర్భాల్లో అసమ్మతికి ఆజ్యం పోస్తూ ఉన్నారు. ఇదే సమయంలో ఆ అసమ్మతివాదుల డిమాండ్లను పట్టించుకోకుండా ఇటు అత్తాకోడళ్లు తమ ఆధిపత్యం చెలాయిస్తూ ముందుకు సాగుతున్నారు.
Palakurthy: ఈ దశలో పలు సందర్భాల్లో వివిధ గ్రామాల్లో అత్తాకోడళ్లపై అసమ్మతి వర్గం కార్యకర్తలు తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూనే ఉన్నారు. వివిధ పథకాల అమలులో తమకు ప్రాధాన్యం ఇవ్వాల్సిందేనని ఆ అసమ్మతి వర్గం నేతలు పట్టుబడుతూ వస్తున్నారు. అయినా అత్తాకోడళ్లు తమ వర్గం వారికి ప్రాధాన్యం ఇస్తూ వస్తున్నారు.
Palakurthy: ఈ దశలో ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో పలుచోట్ల అసమ్మతివాదులు పెద్ద ఎత్తున అభ్యర్థులను నిలబెట్టారు. దీంతో పలుచోట్ల కాంగ్రెస్ పార్టీ బలపర్చిన అభ్యర్థులు ఓటమిపాలై అసమ్మతివాదులు నిలబెట్టిన అభ్యర్థులు గెలిచారు. ఇతర చాలా చోట్ల ప్రత్యర్థులు అంటే బీఆర్ఎస్ పార్టీ బలపర్చిన అభ్యర్థులు విజయం సాధించారు. దీంతో గత అసెంబ్లీ ఎన్నికల నాడు వచ్చిన భారీ మెజార్టీ తగ్గిపోయి, ఒకింత బీఆర్ఎస్ పార్టీ బలపర్చిన అభ్యర్థులకే మెజారిటీ ఓట్లు పోలవడం గమనార్హం.
Palakurthy: ఈ నేపథ్యంలో వచ్చే మున్సిపల్ ఎన్నికల తొర్రూరు మున్సిపాలిటీలో ఎమ్మెల్యే వర్గానికి ప్రాధాన్యం ఇస్తే ఒక్క కౌన్సిలర్ స్థానం కూడా కాంగ్రెస్ గెలిచే అవకాశం ఉండదని అసమ్మతి నేతలు ఏకంగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షీ నటరాజన్‌ను కలిసి ఏకరువు పెట్టారు. ఎమ్మెల్యే యశస్వినీరెడ్డి, ఆమె అత్త ఝాన్సీరెడ్డిపై ఫిర్యాదులు చేశారు. వారి ఆధిపత్యం ఇలాగే కొనసాగితే నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ కనుమరుగు అవడం ఖాయమని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో అసమ్మతి కాంగ్రెస్ నాయకులైన తొర్రూరు మార్కెట్ చైర్మన్ అనుమాండ్ల తిరుపతిరెడ్డి, తొర్రూరు మాజీ ఏఎంసీ చైర్మన్ అనుమాండ్ల నరేందర్‌రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ కాకిరాల హరిప్రసాద్, నాయకులు కిశోర్‌రెడ్డి తదితరులు ఉన్నారు.
