Jahnavi Dangeti

Jahnavi Dangeti: తెలుగు కీర్తి ప్రతిష్టలు: పాలకొల్లు అమ్మాయి జాహ్నవి అంతరిక్షయానం!

Jahnavi Dangeti: అంతరిక్ష యానం అంటే చాలామందికి ఒక కల. అలాంటి కలను నిజం చేసుకోబోతోంది మన తెలుగు అమ్మాయి, పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లుకు చెందిన 23 ఏళ్ల దంగేటి జాహ్నవి. ఆమెకు ఒక అరుదైన అవకాశం లభించింది. అమెరికాకు చెందిన ప్రముఖ ప్రైవేటు అంతరిక్ష పరిశోధన సంస్థ ‘టైటాన్ స్పేస్ ఇండస్ట్రీస్’ (TSI) చేపడుతున్న ప్రతిష్టాత్మక ‘టైటాన్ స్పేస్ మిషన్-2029’ కోసం వ్యోమగామి అభ్యర్థిగా (ASCAN) జాహ్నవి ఎంపికయ్యారు.

అత్యంత విశేషం ఏంటంటే, భారతదేశంలో జన్మించి, ఇక్కడే నివసిస్తున్న ఒక మహిళ నేరుగా అంతరిక్షయానానికి ఎంపికవడం ఇదే మొదటిసారి. ఈ ఘనత సాధించిన తొలి భారతీయ మహిళగా జాహ్నవి రికార్డు సృష్టించారు. టైటాన్ స్పేస్ ప్రతినిధులు నిర్వహించిన అనేక కఠినమైన పరీక్షలను జాహ్నవి విజయవంతంగా పూర్తి చేసి ఈ స్పేస్ మిషన్‌కు అర్హత సాధించారు.

టైటాన్ స్పేస్ సంస్థ భవిష్యత్తులో అంతరిక్షంలో ఒక భారీ అంతరిక్ష కేంద్రాన్ని నిర్మించనుంది. ఇది అంతరిక్ష ప్రయోగాలకు, వాణిజ్య అవసరాలకు, అంతరిక్ష పర్యాటకానికి కేంద్రంగా మారనుంది. ఈ భారీ మిషన్‌లో భాగంగా, 2029 మార్చిలో నిర్వహించబోయే మొదటి అంతరిక్ష యాత్ర బృందంలో భారత్ తరఫున జాహ్నవి పాల్గొననున్నారు. ఈ యాత్రలో ఆమె ఐదు గంటల పాటు అంతరిక్షంలో గడుపుతారు.

Also Read: Shubhanshu Shukla: జూన్ 25న శుభాంశు శుక్లా రోదసియాత్ర.. నాసా ప్రకటన!

Jahnavi Dangeti: ఈ మిషన్‌కు ఎంపికైన అభ్యర్థులకు వచ్చే ఏడాది నుంచి అమెరికాతో పాటు వివిధ దేశాల్లో మూడేళ్ల పాటు కఠినమైన శిక్షణ ఇవ్వనున్నారు. ఈ మిషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను త్వరలో అధికారికంగా వెల్లడించనున్నట్లు టైటాన్ స్పేస్ ఇండస్ట్రీస్ తెలిపింది.

జాహ్నవికి అంతరిక్షంపై మక్కువ చిన్నప్పటి నుంచే ఉందని తెలుస్తోంది. 2021లోనే నాసా నిర్వహించిన ‘ఇంటర్నేషనల్ ఎయిర్ అండ్ స్పేస్ ప్రోగ్రామ్’కు భారత్ తరఫున ఎంపికై అప్పట్లోనే రికార్డు సృష్టించారు. తన తల్లిదండ్రులు కువైట్‌లో ఉద్యోగం చేస్తుండగా, జాహ్నవి తన అమ్మమ్మ లీలావతి వద్ద పెరిగారు. “మా అమ్మమ్మ నాకు చందమామ కథలు చెప్పేది. అప్పటి నుంచే నేను అంతరిక్షంలోకి వెళ్లాలని కలలు కనేదాన్ని” అని జాహ్నవి తన ఆశలను పంచుకున్నారు. జాహ్నవి సాధించిన ఈ అరుదైన అవకాశం తెలుగు వారందరికీ గర్వకారణంగా నిలిచింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *