Pakistani Couple: భారత్-పాకిస్తాన్ అంతర్జాతీయ సరిహద్దు సమీపంలో మరోసారి పాకిస్తాన్‌కు చెందిన జంటను భద్రతా బలగాలు అదుపులోకి తీసుకున్నాయి. గుజరాత్‌లోని కచ్ జిల్లాలో కేవలం ఆరు వారాల వ్యవధిలో ఇలాంటి రెండో అరెస్ట్ నమోదు కావడం భద్రతా వర్గాల్లో ఆందోళన పెంచింది. సరిహద్దు భద్రతా దళం (బీఎస్‌ఎఫ్) సోమవారం నాడు కుద్రా గ్రామ సరిహద్దు ప్రాంతంలో ఈ ఇద్దరిని అరెస్ట్ చేసింది. పాకిస్తాన్‌లోని సింధ్ ప్రావిన్స్‌లోని మితి గ్రామానికి చెందిన పోపట్ కుమార్, గౌరీ (ఇద్దరికీ 24 ఏళ్లు) గా గుర్తించారు. ఈ ఘటన కంటే ముందు సరిగ్గా ఆరు వారాల కిందట కచ్‌లోని ఖదీర్ ప్రాంతం సమీపంలో భద్రతా బలగాలు మరో పాకిస్తానీ జంటను అరెస్ట్ చేశాయి.
ఇది కూడా చదవండి: Telangana: ‘స్థానికం’పై నేడు విచారణ.. ఎన్నికల తేదీలపై స్పష్టత వచ్చేనా?
వీరు తారా రణ్‌మల్ భిల్, మీనాగా గుర్తించారు. వీరు కూడా సింధ్ ప్రావిన్స్‌లోని లసారీకి చెందినవారు. వీరు సరిహద్దు దాటి, కొండ ప్రాంతాల గుండా ఒకటిన్నర రోజు నడిచి భారత భూభాగంలోకి ప్రవేశించారు. పోలీస్ వర్గాల సమాచారం ప్రకారం, మొదటి జంట తమ గ్రామంలో పెళ్లికి అభ్యంతరం రావడంతో భారత్‌లోకి పారిపోయి వచ్చినట్లు తేలింది. అయినప్పటికీ, పోలీసులు, బీఎస్‌ఎఫ్ అధికారులు వారిని గూఢచర్యం కోణంలో పూర్తిగా విచారించారు. తాజాగా అరెస్ట్ అయిన పోపట్ కుమార్, గౌరీ కేసులో కూడా విచారణ కొనసాగుతోంది. చొరబాట్ల వెనుక కేవలం వ్యక్తిగత కారణాలు మాత్రమే ఉన్నాయా లేక మరేదైనా కుట్ర ఉందా అనేది దర్యాప్తు తర్వాతే తెలుస్తుందని అధికారులు తెలిపారు.
