Pakistan: పాకిస్థాన్ మరోసారి తన వక్రబుద్ధిని ప్రదర్శించినట్టు సమాచారం. కాల్పుల విరమణకు అంగీకరించిన కొన్ని గంటలకే, జమ్మూకశ్మీర్‌తో పాటు పలు సరిహద్దు రాష్ట్రాలపై డ్రోన్ల దాడులకు పాల్పడినట్టు తెలుస్తోంది. ఈ ఘటనలతో సరిహద్దు ప్రాంతాల్లో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
శనివారం రాత్రి అంతర్జాతీయ సరిహద్దు మరియు నియంత్రణ రేఖ వెంబడి పాకిస్థాన్ పలు దాడులకు పాల్పడింది. ముఖ్యంగా జమ్మూకశ్మీర్‌లోని శ్రీనగర్, ఉధంపుర్ ప్రాంతాల్లో భారీ శబ్దాలు వినిపించాయని స్థానికులు తెలిపారు. శ్రీనగర్‌లో సంభవించిన భారీ శబ్దాల విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా కూడా ధ్రువీకరించారు.
పాకిస్థాన్ తరఫున ప్రయోగించిన పలు డ్రోన్లను భారత వాయుసేన గగనతల రక్షణ వ్యవస్థలు సమర్థవంతంగా గుర్తించి ధ్వంసం చేశాయి. పోఖ్రాన్ ప్రాంతంతో పాటు శ్రీనగర్‌లోని ఆర్మీ ప్రధాన కార్యాలయం సమీపంలో కూడా కొన్ని డ్రోన్లను కూల్చివేసినట్లు సమాచారం.
ఈ పరిణామాల నేపథ్యంలో సరిహద్దు రాష్ట్రాల్లో హైఅలర్ట్ ప్రకటించారు. పంజాబ్‌లోని పఠాన్‌కోట్, ఫిరోజ్‌పుర్, రాజస్థాన్‌లోని జైసల్మేర్, బార్‌మెర్ ప్రాంతాల్లో ముందస్తు జాగ్రత్తగా విద్యుత్ సరఫరా నిలిపివేశారు. జమ్మూకశ్మీర్‌లోని కఠువా జిల్లాలో బ్లాక్‌అవుట్ అమలు చేసి, సైరన్లు మోగించారు. పంజాబ్‌లోని మోగా ప్రాంతంలో కూడా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.
ఈ దాడుల ప్రభావం గుజరాత్‌పైనా పడింది. కచ్ జిల్లాలో పాకిస్థాన్ డ్రోన్లు కనిపించాయని ఆ రాష్ట్ర హోంమంత్రి హర్ష్ సంఘవి తెలిపారు. దీంతో గుజరాత్‌లోనూ బ్లాక్‌అవుట్ అమలు చేస్తున్నట్టు చెప్పారు. ప్రజలు భయపడకుండా, సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని ఆయన ‘ఎక్స్’ వేదికగా విజ్ఞప్తి చేశారు. తాజా పరిణామాల నేపథ్యంలో భద్రతా బలగాలు మరింత అప్రమత్తంగా వ్యవహరిస్తున్నాయి.