Pakistan Cricket Team

Pakistan Cricket Team: పాపం పాకిస్తాన్..! మరీ ఇన్ని లోటుపాట్లు, చెత్త మేనేజ్మెంట్ పెట్టుకొని ఉన్నారా?

Pakistan Cricket Team: ఒకప్పటి పాకిస్థాన్ క్రికెట్ జట్టు ప్రత్యర్థులకు భయపడేలా ఆడేది. కానీ, ఇప్పుడు ఆ జట్టు స్థాయి పసికూన దేశాల కంటే కూడా తక్కువగా మారిందనే ఎంతోమంది క్రికెట్ అభిమానులు అభిప్రాయపడుతున్నారు. వారందరి నోటా ఒక్కటే మాట. పాకిస్థాన్ అసలు ఎందుకు ఇలా తయారయింది? డిఫెండింగ్ ఛాంపియన్‌గా ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో పాల్గొన్న ఆ జట్టు, ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ ఓటమిని ఎదుర్కొంది. సొంత మైదానంలో కనీసం సెమీఫైనల్‌కైనా చేరుకోలేని దీన స్థితిలో వాళ్ళు ఉన్నారు. పాక్ జట్టు పతనానికి మూడేళ్ల క్రితమే సంకేతాలు కనిపించినప్పటికీ, జట్టు మేనేజ్మెంట్ వాటిని పట్టించుకోలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ సమస్యల నుంచి బయటపడాలంటే, భారత్ అనుసరిస్తున్న విధానాలను అనుకరించాలని క్రికెట్ విశ్లేషకులు సూచిస్తున్నారు.

నిజానికి పాకిస్తాన్ లో టాలెంట్ కు కొదువ లేదు. రిజ్వాన్ – బాబర్ అజామ్ జోడీ, యువ క్రికెటర్లు సల్మాన్ అఘా, ఖుష్దిల్ షా, మరియు ఫాస్ట్ బౌలింగ్ త్రయం షహీన్ షా అఫ్రిది, నసీమ్ షా, హారిస్ రఫూఫ్ వంటి క్రీడాకారులు జట్టులో ఉన్నప్పటికీ, మైదానంలో వారి ప్రదర్శన తేలిపోతోంది. బాబర్ అజామ్ తొలి మ్యాచ్‌లో హాఫ్ సెంచరీ సాధించినప్పటికీ, ఆ ఇన్నింగ్స్‌లో మరేమైనా ప్రత్యేకత కనిపించలేదు. నెమ్మదిగా ఆడినందుకు అతను విమర్శలను ఎదుర్కొన్నాడు. భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో రిజ్వాన్ ఆ బాధ్యతను తీసుకున్నట్లు కనిపించాడు. 77 బంతుల్లో 46 పరుగులు మాత్రమే చేసిన రిజ్వాన్, దూకుడు ఆటను ప్రదర్శించలేకపోయాడు.

సరైన ఓపెనర్ లేకుండానే మ్యాచ్‌లోకి దిగడం కూడా పాక్ జట్టుకు ఇబ్బందులను తెచ్చిపెట్టింది. స్క్వాడ్ ఎంపిక నుంచే పాక్ మేనేజ్మెంట్ తీసుకున్న నిర్ణయాలు విమర్శలను ఎదుర్కొన్నాయి. సెలక్షన్ కమిటీ నుంచి ప్రధాన కోచ్ వరకూ మార్పులు చేసుకుంటూ పోవడం వంటి పొరపాట్లు చాలా చేశారు.

Pakistan Cricket Team: 26 మంది సెలక్టర్లు, నలుగురు కెప్టెన్లు, ఎనిమిది మంది కోచ్లు… ఇదంతా పాకిస్థాన్ క్రికెట్ జట్టుకు గత మూడేళ్లలో తమ అపాట సేవలందించిన సిబ్బంది. టెస్ట్ క్రికెట్‌లో దాదాపు 1000 రోజుల పాటు స్వదేశంలో ఒక్క మ్యాచ్ కూడా గెలవలేకపోయింది. గత పొట్టి కప్ తర్వాత కోచ్‌గా పనిచేసిన గ్యారీ కిరిస్టెన్, పాక్ మేనేజ్మెంట్ మరియు జట్టు నాయకత్వంపై తీవ్ర ఆరోపణలు చేసి బయటకు వెళ్లడం గమనార్హం. సెలక్షన్ కమిటీలో పక్షపాత ధోరణితో నిర్ణయాలు తీసుకోవడం, జట్టులోకి అనుకూలంగా ఉండేవారినే ఎంపిక చేయడం వంటి అంశాలు పాక్ జట్టు పతనానికి కారణాలుగా చెప్పబడుతున్నాయి.

గత వన్డే ప్రపంచకప్ తర్వాత పాక్ కు ముగ్గురు ప్రధాన కోచ్లు మారారు. 2021 నుంచి 2024 వరకు వివిధ ఫార్మాట్లకు సక్లైన్ ముస్తాక్, అబ్దుల్ రహ్మాన్, గ్రాంట్ బ్రాడ్బర్న్, మహమ్మద్ హఫీజ్, అజర్ మహమ్మద్, జాసన్ గిలెస్పీ, గ్యారీ కిరిస్టెన్ వంటి వారు కోచింగ్ బాధ్యతలు నిర్వహించారు. మరోవైపు, దేశవాళీ క్రికెట్‌ను పూర్తిగా నిర్లక్ష్యం చేసి, అక్కడి నుంచి వచ్చిన క్రీడాకారులకు అవకాశాలు లేవనే భావన కలిగించడం కూడా గమనార్హం.

Also Read: ICC tournament: ఐసీసీ టోర్నీల్లో ధోనీ, పాంటింగ్ కంటే గొప్ప కెప్టెన్ అతనే..!

క్రికెట్‌లో ఫిట్నెస్ పాత్ర చాలా కీలకం. ఈ విషయంలో మిగతా జట్లతో పోలిస్తే పాకిస్థాన్ చాలా వెనుకబడి ఉందనేది నిజం. ఫిట్నెస్, స్పెషలైజేషన్, డేటా ఆధారిత వ్యూహాలు వంటి అంశాల్లో ఆస్ట్రేలియా, భారత్‌తో పోలిస్తే పాకిస్థాన్ చాలా వెనుకబడి ఉంది. ఆధునిక క్రికెట్‌లో స్పోర్ట్స్ సైన్స్, అనలిటిక్స్ వంటివి మైదానంలో మరియు నిర్ణయాల్లో కీలక పాత్ర పోషిస్తాయి. తమ క్రీడాకారులు సిక్సర్లు కొట్టడం లేదనే భావనతో, గత పీసీబీ చైర్మన్ మిలిటరీ క్యాంప్‌లో శిక్షణ ఇప్పించాడు. గత టీ20 ప్రపంచకప్‌లో పాక్ జట్టు పరిస్థితి ఏమైందో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు.

Pakistan Cricket Team: దేశవాళీ మరియు అంతర్జాతీయ క్రికెట్‌లో సగటును అంచనా వేసి క్రీడాకారులను ఎంపిక చేయకుండా, ఆధునిక సెలక్షన్ పారామీటర్లను పరిగణనలోకి తీసుకోవాలి. ఇందుకోసం భారత్ వంటి టాప్ టీమ్‌ల నుంచి నేర్చుకోవాల్సిన అంశాలు చాలా ఉన్నాయి. సీనియర్ క్రీడాకారుల స్థానాలను భర్తీ చేసే క్రమంలో కొత్త వారికి అవకాశాలు ఇవ్వడం ఒక ముఖ్య అంశం. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, రవీంద్ర జడేజా వంటి క్రీడాకారులు టీ20లకు వీడ్కోలు పలికిన తర్వాత, వారి స్థానాలను అభిషేక్ శర్మ, సంజు సంసన్, వాషింగ్టన్ సుందర్ వంటి యువ క్రీడాకారులతో భర్తీ చేశారు.

ఇక వన్డేలకు రోహిత్‌కు డిప్యూటీ సారథిగా శుభ్మన్ గిల్‌ను ఛాంపియన్స్ ట్రోఫీకి పంపారు. అదేవిధంగా, ఫామ్‌లో లేని క్రీడాకారులను దేశవాళీ క్రికెట్‌లో ఆడించడం కూడా చేశారు. భారత్‌లో సుస్థిరమైన వ్యవస్థ ఉండటంతో, ఎన్ని సవాళ్లు వచ్చినా తట్టుకోగలిగిందనడంలో అతిశయోక్తి లేదు. కెప్టెన్, ప్రధాన కోచ్, చీఫ్ సెలక్టర్ విషయంలో నమ్మకం ఉంచాలి. అప్పుడే జట్టు ఆట విధానంలో మార్పు వస్తుందని క్రీడా పండితులు విశ్లేషిస్తున్నారు. పాకిస్థాన్ ఈ విషయాలను ఎంత త్వరగా అమలు చేస్తే, పరిష్కారం కూడా అంతే వేగంగా లభిస్తుంది.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *