Pakistan-Afghanistan

Pakistan-Afghanistan: పాక్‌-అఫ్గాన్‌ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం!

Pakistan-Afghanistan: దక్షిణాసియాలో గత కొద్ది నెలలుగా కొనసాగుతున్న పాకిస్థాన్‌-అఫ్గానిస్థాన్‌ సరిహద్దు ఉద్రిక్తతలకు తాత్కాలికంగా తెరపడింది. కతార్ రాజధాని దోహా వేదికగా ఇరుదేశాల మధ్య జరిగిన శాంతి చర్చలు విజయవంతమయ్యాయి. రెండు దేశాలు తక్షణ కాల్పుల విరమణకు అంగీకరించినట్లు ఖతార్ విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికారికంగా ప్రకటించింది.

ఖతార్, తుర్కియే దేశాల మధ్యవర్తిత్వంతో రెండు దఫాలుగా జరిగిన ఈ చర్చల్లో, ఇరుపక్షాల రక్షణ మంత్రులు, భద్రతా సలహాదారులు పాల్గొన్నారు. సరిహద్దుల్లో శాశ్వత శాంతి, స్థిరత్వం కోసం కృషి చేస్తామని ఇరుదేశాలు హామీ ఇచ్చాయి. ఈ ఒప్పందాన్ని పర్యవేక్షించడం, స్థిరత్వాన్ని కొనసాగించడంపై రానున్న రోజుల్లో మరింతగా చర్చలు జరపాలని కూడా అంగీకరించాయి.

ఈ శాంతి చర్చలు జరగడానికి సరిగ్గా 24 గంటల ముందు, పాకిస్థాన్ అఫ్గానిస్థాన్‌లోని పాక్టికా ప్రావిన్స్‌పై వైమానిక దాడులకు పాల్పడటం గమనార్హం. ఈ దాడుల్లో డజన్ల మంది సాయుధ సిబ్బంది మరణించినట్లు పాక్ భద్రతాధికారులు ప్రకటించగా, అఫ్గానిస్థాన్ అధికారులు మాత్రం ముగ్గురు యువ క్రికెటర్లు, మహిళలు, చిన్నారులతో సహా కనీసం 10 నుంచి 17 మంది పౌరులు మృతి చెందారని తీవ్రంగా ఆరోపించారు.

Also Read: USA Road Accident: అమెరికాలో రోడ్డు ప్రమాదం: మంచిర్యాల వాసుల మృతి

గత కొంతకాలంగా పాకిస్థాన్, అఫ్గాన్ భూభాగం నుంచి తమ సైనిక స్థావరాలపై సీమాంతర ఉగ్రవాదం జరుగుతోందని ఆరోపిస్తోంది. అయితే, సరిహద్దుల్లోని ఉగ్రవాదులకు తాము ఆశ్రయం కల్పించడం లేదని, ఆ ఆరోపణలు వాస్తవానికి దూరంగా ఉన్నాయని అఫ్గాన్ ప్రభుత్వం ఖండించింది.

చరిత్రను పరిశీలిస్తే, పాకిస్థాన్‌కు కాల్పుల విరమణ ఒప్పందాలను ఉల్లంఘించడం అలవాటుగా మారింది. గతంలో భారత్‌తో, అలాగే ఇటీవల ఆఫ్ఘనిస్థాన్‌తో కుదిరిన 48 గంటల కాల్పుల విరమణ ఒప్పందాన్ని సైతం గంటల వ్యవధిలోనే పాక్ వైమానిక దాడుల ద్వారా ఉల్లంఘించింది. అందుకే, ఈ తాజా ఒప్పందాన్ని పాకిస్థాన్ ఎంతవరకు గౌరవిస్తుంది, మళ్ళీ దొడ్డిదారిన దాడులకు పాల్పడుతుందా అనే అనుమానాలు అంతర్జాతీయ సమాజంలో బలంగా ఉన్నాయి. ఇటీవలి కాలంలో సరిహద్దు ఉద్రిక్తతలు పెరిగి, పాక్ సైనికులను ఆఫ్ఘన్ బలగాలు మట్టుబెట్టడంతో, పాకిస్థానే దిగివచ్చి ఖతార్, తుర్కియే దేశాలను మధ్యవర్తిత్వం కోసం కోరినట్లు సమాచారం.

ఈ కాల్పుల విరమణ ఒప్పందం ప్రాంతీయ శాంతి దిశగా ఒక సానుకూల అడుగుగా అంతర్జాతీయ వర్గాలు భావిస్తున్నాయి. ఐక్యరాజ్యసమితి, అమెరికా, చైనా వంటి దేశాలు కూడా ఈ పరిణామాన్ని స్వాగతించాయి. అయితే, సరిహద్దు భద్రత, ఉగ్రవాద నియంత్రణ, వాణిజ్య మార్గాల పునరుద్ధరణ వంటి అంశాలపై దీర్ఘకాల శాంతి కోసం ఇరుదేశాలు కలిసి పనిచేయాల్సి ఉంది.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *