Pak-Afghan

Pak-Afghan: ఆఫ్ఘనిస్తాన్-పాకిస్తాన్ శాంతి చర్చలు విఫలం: మళ్లీ యుద్ధం అంచుకు!

Pak-Afghan: ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ మధ్య టర్కీలోని ఇస్తాంబుల్‌లో నాలుగు రోజుల పాటు జరిగిన కీలక శాంతి చర్చలు ఎటువంటి పురోగతి లేకుండానే ముగిశాయి. ఫలితంగా, ఇరు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు మరోసారి యుద్ధ వాతావరణానికి దారి తీసేలా కనిపిస్తున్నాయి. పాకిస్తాన్‌పై ఉగ్రదాడులకు పాల్పడుతున్న తెహ్రీక్-ఇ-తాలిబన్ పాకిస్తాన్ (TTP) వంటి మిలిటెంట్ గ్రూపులపై చర్యలు తీసుకునేందుకు ఆఫ్ఘన్ తాలిబన్ ప్రభుత్వం లిఖితపూర్వక హామీ ఇవ్వడానికి నిరాకరించడమే చర్చలు విఫలం కావడానికి ప్రధాన కారణంగా తెలుస్తోంది. తమకు వ్యతిరేకంగా ఆఫ్ఘన్ గడ్డను ఉగ్రవాద కార్యకలాపాలకు ఉపయోగించకుండా ఉండాలని పాకిస్తాన్ పట్టుబట్టింది.

ఆఫ్ఘన్ తాలిబన్ ప్రతినిధులు ఈ డిమాండ్‌లపై ‘మొండివైఖరి’ ప్రదర్శించారని, ముఖ్యంగా TTP విషయంలో ఎటువంటి ధృవీకరించదగిన చర్యలకు హామీ ఇవ్వడానికి ఇష్టపడలేదని పాకిస్తాన్ వర్గాలు ఆరోపించాయి. చర్చల వైఫల్యానికి ఇరు దేశాలు పరస్పరం నిందించుకున్నాయి.ఆఫ్ఘన్ బృందం ‘కోర్ ఇష్యూ’ (ఉగ్రవాదంపై చర్య) నుండి తప్పుకుందని పాకిస్తాన్ సమాచార శాఖ మంత్రి అత్తొల్లా తరార్ ప్రకటించారు. పాకిస్తాన్ బృందం ‘నిర్మాణాత్మక చర్చలు’ జరపడానికి ఆసక్తి చూపలేదని, కేవలం వెనక్కి తగ్గడానికి మొగ్గు చూపారని ఆఫ్ఘన్ అధికారిక మీడియా పేర్కొంది.

ఇది కూడా చదవండి: Crime News: ప్రియుడితో కలిసి భర్తను లేపేసిన ఇల్లాలు

చర్చలు విఫలమైన నేపథ్యంలో పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ చేసిన హెచ్చరికలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. శాంతి చర్చలు విఫలమైతే, ఆఫ్ఘనిస్తాన్‌పై దాడులు చేయడం తప్ప మాకు వేరే మార్గం లేదు. అప్పుడు బహిరంగ యుద్ధం తప్పదు.ఈ నెల ప్రారంభంలో ఆఫ్ఘన్ సరిహద్దుల్లో జరిగిన ఘర్షణల్లో ఇరువైపులా డజన్ల కొద్దీ సైనికులు, పౌరులు మరణించారు. ఖతార్, టర్కీ మధ్యవర్తిత్వంతో తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం కుదిరినా, తాజా చర్చల వైఫల్యం మళ్లీ ఘర్షణలకు దారి తీయవచ్చని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *