Padi kaushik reddy: బీఆర్ఎస్ (BRS) పార్టీ నేత, హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి క్వారీ యజమానిని బెదిరించిన కేసులో విడుదలైన అనంతరం శనివారం కోర్టు ఆవరణలో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి.
కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ, “ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డ్రామాలు రాష్ట్ర ప్రజలందరికీ తెలిసిపోయాయి. నన్ను జైలుకు పంపేందుకు ఎన్నో కుట్రలు చేశారు. కానీ నేను భయపడేది కాదు. రాష్ట్రంలో మంత్రులు ఇసుక మాఫియా, భూ కబ్జాలకు పాల్పడుతున్నారు. రేపు మీడియా ముందు అన్ని ఆధారాలతో బయటపడతాను. వారికెలాంటి చట్టబద్ధమైన హోదా లేదని చెబుతాను. రాష్ట్రంలో నేనే ‘ఏకే-47’ అవుతాను,” అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
ఇదిలా ఉండగా, క్వారీ యజమానిని బెదిరించిన కేసులో ఇటీవల కౌశిక్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఆయన్ను వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో వైద్య పరీక్షల అనంతరం కాజీపేట రైల్వే కోర్టుకు హాజరుపరిచారు. 41ఏ నోటీసులు జారీ చేయకుండా అక్రమంగా అరెస్ట్ చేశారని కౌశిక్ రెడ్డి తరఫున న్యాయవాది వాదించారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి, షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేశారు.
ఈ ఘటనపై రాజకీయ వర్గాల్లో చర్చ కొనసాగుతోంది. కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు, రేపు ఆయన వెల్లడించబోతున్న వివరాలు ఏం ఉంటాయన్న ఉత్కంఠ నెలకొంది.