Ourangajeb: ఉద్యోగాల కల్పన మా ప్రభుత్వ బాధ్యత కాదు

Ourangajeb: పాకిస్థాన్‌లో తీవ్ర ఆర్థిక సంక్షోభం, పెరుగుతున్న నిరుద్యోగంపై ఆ దేశ ప్రభుత్వం చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఉద్యోగాల కల్పన ప్రభుత్వ బాధ్యత కాదని, ఆ బాధ్యత పూర్తిగా ప్రైవేటు రంగానిదేనని పాకిస్థాన్ ఆర్థిక మంత్రి ముహమ్మద్ ఔరంగజేబు స్పష్టం చేశారు.

ప్రస్తుతం పాకిస్థాన్‌లో నిరుద్యోగ రేటు 7.1 శాతానికి చేరింది. అధికారిక గణాంకాల ప్రకారం 7.72 కోట్ల కార్మిక శక్తిలో 80 లక్షల మందికి పైగా ఉద్యోగాలు లేకుండా ఉన్నారు. ఆర్థిక ఒడిదొడుకులు, పెరుగుతున్న పేదరికం కారణంగా ప్రజల జీవన ప్రమాణాలు తీవ్రంగా పడిపోతున్నాయి.

ఇలాంటి పరిస్థితుల్లో ఉద్యోగాల కల్పన బాధ్యత నుంచి ప్రభుత్వం తప్పుకోవడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఉద్యోగాలను నేరుగా సృష్టించకపోయినా, వాటికి అనుకూల వాతావరణం కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

ప్రైవేటు రంగం ముందుకు రాని కారణాలు

పాకిస్థాన్‌లో రాజకీయ అస్థిరత, ఆర్థిక విధానాల్లో స్పష్టత లేకపోవడం, తరచూ మారే పన్నుల విధానం, అధిక వడ్డీ రేట్లు, ఇంధన కొరత, కరెన్సీ అస్థిరత వంటి కారణాలతో ప్రైవేటు రంగం పెట్టుబడులకు వెనుకంజ వేస్తోంది. నిర్మాణ, రియల్ ఎస్టేట్ రంగాల్లో మాఫియా బెదిరింపులు పెరిగిపోయాయని బిల్డర్ల సంఘాలు ఆరోపిస్తున్నాయి.

కుప్పకూలుతున్న పరిశ్రమలు

లాహోర్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ నివేదిక ప్రకారం, తయారీ రంగంలో ప్రైవేటు పెట్టుబడులు 2019లో రూ.706 బిలియన్ల నుంచి 2025 నాటికి రూ.377 బిలియన్లకు పడిపోయాయి. ఇది దాదాపు 46 శాతం తగ్గుదల. కొత్త పెట్టుబడులు రాకపోవడంతో పాటు, ఉన్న యంత్రాలను ఆధునికీకరించేందుకు కూడా నిధులు లేని పరిస్థితి నెలకొంది

ఉద్యోగాల సమస్యను ప్రైవేటు రంగంపై నెట్టేయడం పరిష్కారం కాదని, స్థిరమైన విధానాలు, చౌక రుణాలు, నిరంతరాయ విద్యుత్ సరఫరా, శాంతిభద్రతలు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని పాకిస్థాన్ ప్రముఖ పత్రికలు స్పష్టం చేస్తున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *