Oracle's Layoffs Explained

Oracle Layoffs Explained: ఒరాకిల్ సంచలన నిర్ణయం.. ప్రపంచవ్యాప్తంగా 30,000 మంది ఉద్యోగుల తొలగింపు!

Oracle Layoffs Explained: ప్రముఖ టెక్ దిగ్గజం ఒరాకిల్ (Oracle) తన వ్యాపార వ్యూహాల్లో భాగంగా ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున ఉద్యోగుల తొలగింపునకు శ్రీకారం చుట్టింది. కంపెనీ ఆదాయం గణనీయంగా పెరిగినప్పటికీ, సుమారు 30,000 మంది ఉద్యోగులను తొలగించవచ్చని అంతర్జాతీయ నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. ముఖ్యంగా భారతదేశం, మెక్సికో వంటి దేశాల్లోని కార్యాలయాలపై ఈ ప్రభావం తీవ్రంగా ఉంది. ఏఎన్ఐ (ANI) నివేదికల ప్రకారం, మన దేశంలో పనిచేస్తున్న సుమారు 12,000 మంది ఉద్యోగులకు తొలగించినట్టు తెలుస్తుంది.  ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఇంకా డేటా సెంటర్ల విస్తరణపై దృష్టి సారించడమే ఈ భారీ లేఆఫ్స్‌కు ప్రధాన కారణమని తెలుస్తోంది.

ఏఐ (AI) కోసం భారీ పెట్టుబడులు – ఉద్యోగులపై భారం

ఒరాకిల్ ప్రస్తుతం ఏఐ మౌలిక సదుపాయాల రంగంలోకి దూకుడుగా అడుగుపెడుతోంది. ముఖ్యంగా OpenAI కోసం ఏఐ డేటా సెంటర్లను నిర్మించేందుకు ఐదేళ్ల కాలానికి గాను 156 బిలియన్ డాలర్ల భారీ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఈ ప్రాజెక్టుల కోసం కంపెనీ దాదాపు 30 లక్షల ప్రత్యేక చిప్‌లను కొనుగోలు చేస్తోంది. దీనివల్ల కంపెనీ వ్యయం రెండు సంవత్సరాల క్రితం ఉన్న 6.9 బిలియన్ డాలర్ల నుండి ఈ ఏడాది ఏకంగా 50 బిలియన్ డాలర్లకు పెరిగింది. ఈ స్థాయి పెట్టుబడులకు నిధులు సమకూర్చుకోవడానికి, ఇతర రంగాలలో ఖర్చులను తగ్గించుకోవడంలో భాగంగానే ఈ ఉద్యోగ కోతలు విధిస్తున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.

రుణ ఒత్తిడి మరియు ఆర్థిక సవాళ్లు

ఒరాకిల్ ప్రస్తుతం 108 బిలియన్ డాలర్లకు పైగా అప్పుల్లో ఉంది. పెరిగిన అప్పులు ఇంకా వడ్డీల భారం కంపెనీని ఆర్థికంగా ఒత్తిడికి గురిచేస్తున్నాయి. టీడీ కోవెన్ అంచనాల ప్రకారం, ఈ ఉద్యోగ కోతల ద్వారా కంపెనీకి 8 నుండి 10 బిలియన్ డాలర్ల నగదు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. దీనిని తిరిగి ఏఐ ప్రాజెక్టులకు మళ్లించాలని కంపెనీ భావిస్తోంది. మరోవైపు, ఒరాకిల్ క్రెడిట్ రేటింగ్‌ను బార్క్లేస్ గతంలోనే తగ్గించింది, ఇది కంపెనీకి కొత్త రుణాలు పుట్టకుండా ఇబ్బందులు సృష్టిస్తోంది.

కీలక కస్టమర్ విషయంలో అనిశ్చితి

ఒరాకిల్ నిర్మిస్తున్న కొత్త మౌలిక సదుపాయాలపై డిమాండ్ పరంగా కూడా కొన్ని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. కంపెనీకి ప్రధాన కస్టమర్ అయిన OpenAI, ఎన్విడియా (Nvidia) నుండి మరింత వేగవంతమైన చిప్‌లను కోరుకుంటున్నట్లు సమాచారం. దీనివల్ల ఒరాకిల్ ఇప్పటికే బిలియన్ల కొద్దీ డాలర్లు ఖర్చు చేసి నిర్మిస్తున్న డేటా సెంటర్లు పూర్తి స్థాయిలో వినియోగంలోకి వస్తాయా లేదా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. టెక్నాలజీలో వస్తున్న వేగవంతమైన మార్పుల వల్ల పాత చిప్‌లు త్వరగా కాలం చెల్లినవిగా మారే ప్రమాదం కూడా ఉంది.

ఈ పరిణామాల మధ్య ఒరాకిల్ స్టాక్ సెప్టెంబర్ 2025లో 346 డాలర్ల వద్ద ఉండగా, ప్రస్తుతం 146 డాలర్లకు పడిపోయింది. ఇది కంపెనీ వ్యవస్థాపకుడు లారీ ఎల్లిసన్ నికర ఆస్తిపై కూడా ప్రతికూల ప్రభావం చూపింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *