Operation Sindoor: జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా మే 7న ప్రారంభించిన ఆపరేషన్ సిందూర్ ఇంకా కొనసాగుతూనే ఉందని, ఉగ్రవాదం పూర్తిగా అంతం కాలేదని ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది స్పష్టం చేశారు. న్యూఢిల్లీలో జరిగిన ఒక పుస్తకావిష్కరణ కార్యక్రమంలో మాట్లాడిన ఆయన, “మే 10న యుద్ధం ముగిసిందని చాలామంది అనుకుంటున్నారు. కానీ ఆపరేషన్ ఇంకా కొనసాగుతుంది అన్నారు. ఎందుకంటే అనేక కీలక నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చింది. దాని పూర్తి వివరాలను ఇప్పుడు పంచుకోవడం సాధ్యం కాదు,” అని తెలిపారు.
జనరల్ ద్వివేది మాట్లాడుతూ, పాకిస్తాన్ మద్దతుగల ఉగ్రవాదం ఇంకా కొనసాగుతూనే ఉందని, ఎల్‌ఓసీ వెంబడి చొరబాటు ప్రయత్నాలు జరుగుతున్నాయని హెచ్చరించారు. “ఆపరేషన్ సిందూర్ ముగిసిన కాలం చాలా తక్కువ. దాని ప్రభావాన్ని అంచనా వేయడానికి ఇంకా సమయం కావాలి. ఉగ్రవాదులు పూర్తిగా తుడిచిపెట్టుకుపోలేదు. ఎంతమంది ఉగ్రవాదులు చంపబడ్డారో, ఎంతమంది తప్పించుకున్నారో మనందరికీ తెలుసు,” అని అన్నారు.
సైనిక దళాల సమన్వయానికి ప్రాధాన్యం
ఆపరేషన్ సమయంలో భారత సైన్యంలోని సమన్వయాన్ని జనరల్ ద్వివేది ప్రశంసించారు. దళాల కదలికలు ఒకే త్రాణంగా, సమకాలీకరించి జరిగాయని ఆయన పేర్కొన్నారు.
అలాగే, మూడు దళాల ఏకీకరణపై దృష్టి సారిస్తూ, థియేటరైజేషన్ అనివార్యం అని స్పష్టం చేశారు. “ఇది ఈరోజు అయినా రేపు అయినా జరుగుతుంది. దానికి ఎంత సమయం పడుతుందో అనేదే ప్రశ్న,” అని చెప్పారు. ఆధునిక యుద్ధాల్లో అనేక ఏజెన్సీల సమన్వయం అవసరమని, ఒకే కమాండ్ వ్యవస్థ కీలకమని ఆయన అన్నారు.
ఇది కూడా చదవండి: Honeymoon Murder Case: సోనమ్ ప్రధాన నిందితురాలు.. 790 పేజీల ఛార్జిషీట్..
GST సంస్కరణలపై స్పందన
డ్రోన్‌లపై GSTని 18% నుండి 5%కు తగ్గించడం రక్షణ రంగానికి పెద్ద మేలని ఆర్మీ చీఫ్ అభిప్రాయపడ్డారు. “ఇది భారీ ఎత్తున కొనుగోళ్లు జరగడానికి దారితీస్తుంది. రక్షణ కారిడార్లకు కొత్త ఊపు వస్తుంది. MSMEలు, స్టార్టప్‌లకు ఇది భారీ ప్రోత్సాహం అవుతుంది,” అని ఆయన అన్నారు.
ఎయిర్ చీఫ్ మార్షల్ అభిప్రాయం
చెన్నైలో జరిగిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో ఎయిర్ చీఫ్ మార్షల్ అమర్ ప్రీత్ సింగ్ కూడా ఆపరేషన్ సిందూర్‌లో చూపిన సమన్వయాన్ని ప్రశంసించారు. “ఈ ఆపరేషన్ మూడు దళాల మధ్య ఉన్న సమన్వయం, ఉమ్మడిత్వానికి నిదర్శనం. భవిష్యత్తు కార్యకలాపాలకు ఇది ఆదర్శం,” అని ఆయన తెలిపారు.
చెన్నైలోని ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ నుండి పట్టభద్రులైన క్యాడెట్లను ఉద్దేశించి మాట్లాడుతూ, “మీ కెరీర్‌లో ఉమ్మడి స్ఫూర్తిని మరింత పెంచుకుని ముందుకు సాగండి,” అని సూచించారు.