Cigarette Price Hike: సిగరెట్ ప్రియులకు ఇది నిజంగానే పిడుగు లాంటి వార్త. ఇప్పటికే పెరుగుతున్న ధరలతో బడ్జెట్ తలకిందులవుతోందని ఫీలవుతున్న స్మోకర్లకు కేంద్ర ప్రభుత్వం భారీ షాక్ ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. దేశంలో పొగాకు వినియోగాన్ని గణనీయంగా తగ్గించడమే లక్ష్యంగా, సిగరెట్లపై ఎక్సైజ్ సుంకాన్ని భారీగా పెంచాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఇదే గనుక అమలులోకి వస్తే, ప్రస్తుతం మార్కెట్లో సగటున 18 రూపాయలు పలుకుతున్న ఒక్కో సిగరెట్ ధర ఏకంగా 72 రూపాయలకు చేరుకునే అవకాశం ఉందని అధికార వర్గాల సమాచారం.
కేంద్ర ఆర్థిక సహాయ మంత్రి పంకజ్ చౌదరి ప్రవేశపెట్టిన బిల్లులో పొగాకు ఉత్పత్తులపై ఎక్సైజ్ డ్యూటీ మరియు సెస్సులను పునఃసమీక్షించాలని ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదన ప్రకారం పన్నులు మూడు రెట్లు పెరిగే అవకాశం ఉండటంతో, సిగరెట్ ధరలు సామాన్యుడికి అందనంత ఎత్తుకు చేరుకోనున్నాయి. ముఖ్యంగా యువత మరియు విద్యార్థులు ఈ అలవాటుకు దూరంగా ఉండాలనే ఉద్దేశంతోనే ప్రభుత్వం ఈ కఠిన నిర్ణయం దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది.
ఈ వార్త సోషల్ మీడియాలో దావానలంలా వ్యాపించడంతో నెటిజన్ల నుంచి భిన్నమైన స్పందనలు వస్తున్నాయి. రెడిట్ వంటి ప్లాట్‌ఫారమ్స్‌లో కొందరు స్మోకర్లే ఈ నిర్ణయాన్ని స్వాగతించడం విశేషం.
ఇది కూడా చదవండి: Film Chamber: ఫిల్మ్ ఛాంబర్ ఎన్నికల్లో గెలిచింది వీరే..!
నేను స్మోకర్ అయినప్పటికీ ఈ నిర్ణయాన్ని సమర్థిస్తాను, ధరలు పెరిగితే కనీసం భయం చేతయినా నేను ఈ అలవాటు మానేస్తాను, తద్వారా దేశంలో స్మోకర్ల సంఖ్య తగ్గుతుంది అంటూ ఒక వినియోగదారుడు చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది.
మరోవైపు, ఈ ధరల పెరుగుదలపై నెటిజన్లు తమదైన శైలిలో సెటైర్లు పేలుస్తున్నారు. “ఢిల్లీ వంటి నగరాల్లో ఎలాగో కలుషితమైన పొగ ఉచితంగానే దొరుకుతోంది, ఇక డబ్బులు పెట్టి సిగరెట్లు కొనడం ఎందుకు?” అంటూ కొందరు కామెడీ చేస్తుంటే, మరికొందరు మాత్రం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ధరలు విపరీతంగా పెంచడం వల్ల స్మగ్లింగ్ పెరిగే ప్రమాదం ఉందని, అలాగే జనం ఈ-సిగరెట్లు లేదా నాణ్యత లేని ఇతర పొగాకు ఉత్పత్తుల వైపు మళ్లే అవకాశం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.
చివరగా, కొందరు నెటిజన్లు మాత్రం ఈ నిర్ణయాన్ని పూర్తిగా సమర్థిస్తూ.. కేవలం ధరలు పెంచడం మాత్రమే కాకుండా పొగాకు మరియు మద్యంపై పూర్తిస్థాయి నిషేధం విధించాలని కోరుతున్నారు. ఏది ఏమైనా, కేంద్రం గనుక ఈ నిర్ణయాన్ని అధికారికంగా అమలు చేస్తే, స్మోకర్ల జేబులకు చిల్లు పడటం ఖాయమని అర్థమవుతోంది.
