Hyderabad: హైదరాబాద్ పాతబస్తీ సౌత్ వెస్ట్ జోన్‌లో ఒక పోలీస్ ఇన్‌స్పెక్టర్ వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఆయన ఏకంగా ‘వసూళ్ల దందా’ నడుపుతున్నాడని స్థానికులు, చివరికి స్టేషన్ సిబ్బందే ఆరోపిస్తున్నారు. ప్రతి పనికి ఒక రేటు ఫిక్స్ చేసి, విచ్చలవిడిగా అక్రమాలకు, అవినీతికి పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. భూ వివాదాలు పరిష్కరించడంలో, నేరం చేసిన వారిని కేసుల నుండి తప్పించడంలో, అక్రమంగా డబ్బులు సంపాదిస్తున్న ముఠాల నుండి మామూళ్లు తీసుకోవడమే ఈ సీఐ ప్రధాన పనిగా పెట్టుకున్నారట.
తాజాగా, ఈ సీఐ సీసీ కెమెరాల పేరు చెప్పి పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేసినట్లు సమాచారం. స్కూళ్లు, రెస్టారెంట్లు, బార్లు, షాపుల యజమానుల నుండి దాదాపు రూ.20 లక్షలు సేకరించారని స్థానికులు గుసగుసలాడుకుంటున్నారు. ఇక ఇటీవల ఒక పెళ్లి ఊరేగింపులో కొందరు యువకులు కత్తులు తిప్పుతూ హల్‌చల్ చేసిన వీడియో వైరల్ అయిన సంగతి తెలిసిందే. దీనిపై ఉన్నతాధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించినా, ఈ సీఐ అక్కడ కూడా తన వసూళ్ల పర్వం కొనసాగించారనే ఆరోపణ ఉంది. ఈ కేసులో నిజమైన నిందితులను తప్పించి, అమాయకులను ఇరికించడానికి ఏకంగా రూ.2.5 లక్షలు లంచం తీసుకున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.
ఈ సీఐ దందా ఎంతలా ఉందంటే, అర్ధరాత్రి పూట వసూళ్లకు పాల్పడుతున్న ఒక ముఠాను స్టేషన్ కానిస్టేబుళ్లు కష్టపడి పట్టుకుంటే… ఆ కానిస్టేబుళ్లపైనే ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారట. ఎలాంటి కేసు పెట్టకుండానే ఆ ముఠాను వదిలిపెట్టేయాల్సిందిగా ఆదేశించారని స్టేషన్ సిబ్బంది ఆరోపిస్తున్నారు. దీని వెనుక పెద్ద కథే ఉందంటున్నారు పోలీస్ వర్గాలు. కమిషనరేట్‌లో ఉండే తన ‘గాడ్‌ఫాదర్’ అండదండలతోనే ఈ సీఐ ఇంతటి అక్రమాలకు పాల్పడుతున్నాడని, అందుకే ఎవరికీ భయపడడం లేదని చర్చించుకుంటున్నారు. ఇలాంటి అవినీతి అధికారిపై ఉన్నతాధికారులు వెంటనే చర్యలు తీసుకుని, పాతబస్తీలో శాంతిభద్రతలను కాపాడాలని స్థానికులు గట్టిగా డిమాండ్ చేస్తున్నారు.

