Hyderabad: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హైడ్రా (HYDRA) ఆపరేషన్ కబ్జాదారులపై ఉక్కుపాదం మోపుతోంది. ప్రభుత్వ భూములు, నాలాలు, చెరువులు, బఫర్ జోన్ ప్రాంతాలను అక్రమ ఆక్రమణల నుంచి కాపాడుతూ వందలాది ఎకరాలను ఇప్పటికే స్వాధీనం చేసుకుంది.
ఈ క్రమంలో హైదరాబాద్ పాతబస్తీ ప్రాంతంలో ఉన్న సర్వే నంబర్ 28లోని 7 ఎకరాల ప్రభుత్వ భూమిని హైడ్రా అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ భూమి విలువ సుమారు రూ.400 కోట్లుగా అధికారులు అంచనా వేస్తున్నారు. స్వాధీనం చేసుకున్న భూమి చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేసి, ప్రభుత్వ భూమి అని స్పష్టంగా పేర్కొంటూ హైడ్రా బోర్డులు ఏర్పాటు చేశారు.
రెవెన్యూ, పోలీసు అధికారుల సమక్షంలో అక్రమంగా నిర్మించిన ప్రహారీలను హైడ్రా సిబ్బంది తొలగించారు. సర్వే ఆఫ్ ఇండియా మ్యాప్ ప్రకారం అక్కడ మొత్తం 9.11 ఎకరాల ప్రభుత్వ భూమి ఉండగా, అందులో ఇప్పటికే 2 ఎకరాల్లో నివాసాలు నిర్మించబడ్డాయని తెలిపారు. నివాసాల జోలికి వెళ్లకుండా, మిగిలిన 7 ఎకరాల భూమిని మాత్రమే అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
అక్కడ ఒకప్పుడు చెరువు ఉన్నట్లు అధికారులు నిర్ధారించారు. చెరువును మట్టితో పూడ్చి అక్రమ ఆక్రమణలకు పాల్పడినట్లు గుర్తించారు. ఈ భూమిని ప్లాట్లుగా మార్చి అమ్మే ప్రయత్నాన్ని హైడ్రా అడ్డుకుంది. కోర్టు ఇప్పటికే కోటి రూపాయల జరిమానా విధించినప్పటికీ కబ్జాదారులు మారలేదని అధికారులు తెలిపారు
ఈ ఘటనపై భవానీపురం పోలీస్ స్టేషన్‌లో కబ్జాదారులపై కేసులు నమోదు చేశారు. సున్నితమైన ప్రాంతంలో వివాదాలకు చెక్ పెట్టడంతో హైడ్రా చర్యలపై స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.
హైడ్రా చర్యలతో ఊపిరి పీల్చుకున్నామని స్థానికులు తెలిపారు. కుమ్మరి వాడి పీస్ వెల్ఫేర్ సొసైటీ నుంచి అభినందనలు వెల్లువెత్తాయి. నాలా, చెరువు పునరుద్ధరిస్తే వరద ముప్పు తగ్గుతుందని వారు సూచించారు. ఈ సందర్భంగా హైడ్రా కమిషనర్ ఏ.వి. రంగనాథ్‌కు స్థానికులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
