Odisha: నాకు జరిగిన అన్యాయం మరొకరికి జరగొద్దు.. ఇలాంటి వేధింపులు ఇంకొకరికి ఎదురు కావద్దు.. నన్ను వేధించిన కామాంధుడికి కఠిన శిక్ష అమలు కావాలి.. అనుకున్న ఆ యువతికి చివరికి అన్యాయమే మిగిలింది. చేయని ప్రయత్నమంటూ లేదు. తన గోడు ఎవరూ పట్టించుకోవడం లేదని చింతించి, చివరికి తన చితిని తానే పేర్చుకున్నది. ఒడిశా బాలాసోర్‌లో నిన్న నిప్పంటించుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన బీఈడీ విద్యార్థిని ఈ రోజు చికిత్స పొందుతూ కానరాని లోకాలకు వెళ్లింది.
Odisha: ఒడిశా బాలాసోర్‌లోని ఫకీర్ మోహన్ కళాశాలలో సౌమ్యశ్రీ బీసీ (20) అనే విద్యార్థిని బీఎడ్ విద్యనభ్యసిస్తున్నది. తనకు హాజరు శాతం తక్కువగా ఉన్నదని ఆ కళాశాల హెచ్‌వోడీ సమీర్ కుమార్ సాహూను సౌమ్యశ్రీ సాయం కోరింది. ఇదే అదనుగా భావించిన ఆ హెచ్‌వోడీ లైంగికంగా వేధింపులకు దిగాడు. సౌమ్యశ్రీ నిరాకరించడంతో మార్కులు తగ్గిస్తానని బెదిరింపులకు దిగాడు. పదే పదే వేధించసాగాడు.
Odisha: దీంతో విసిగి వేసారిన సౌమ్యశ్రీ గత జూన్ 1న హెచ్‌వోడీ వేధింపులపై కళాశాల యాజమాన్యానికి ధైర్యంగా ఫిర్యాదు చేసింది. అదేమి వైచిత్రమో కానీ, హెచ్‌వోడీపై చర్యలు తీసుకోవాల్సిన కళాశాల యాజమాన్యం.. అతడినే సమర్థించింది. ఈ విషయాన్ని గ్రహించిన ఆ యువతి.. ఎలాగైనా తనను వేధించిన దుర్మార్గుడికి తగిన శాస్తి జరగాలని భావించింది.
Odisha: తన అన్ని సోషల్ మీడియా ఖాతాల్లో ఒడిశాలోని బీజేపీ ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని, ఒడిశా ముఖ్యమంత్రి, ఒడిశా రాష్ట్ర మంత్రులు, కేంద్ర విద్యాశాఖ మంత్రి, ఎన్‌సీడబ్ల్యూ ఇలా పలు ఖాతాలకు సాయం చేయాలని కోరుతూ పోస్టులను ట్యాగ్ చేసి తనకు జరిగిన లైంగిక వేధింపులను విద్యార్థిని సౌమ్యశ్రీ పోస్టు చేసింది. ఎంతో ఆశించిన సౌమ్యశ్రీకి నిరాశే ఎదురైంది.
Odisha: ఇదే సమయంలో పుండుమీది కారం చల్లినట్టు కళాశాల యాజమాన్యం వ్యవహారించింది. జూలై 10న సౌమ్యశ్రీని కళాశాల యాజమాన్యం పిలిచి హెచ్‌వోడీపై ఫిర్యాదును వెనక్కి తీసుకోవాలని, లేదంటే కళాశాల నుంచి బహిష్కరిస్తానని కళాశాల ప్రిన్సిపాల్ దిలీప్ ఘోష్ ఏకంగా బెదిరింపులకే దిగాడు.
Odisha: ఇక న్యాయం జరగదనుకున్న ఆ యువతి పోరాటానికి దిగాలని నిర్ణయించుకున్నది. జూలై 12న కళాశాల క్యాంపస్‌లోని ప్రిన్సిపాల్ ఆఫీస్ ఎదుట నిరసనకు దిగింది. ఇంతలోనే నిరుత్సాహం ఆవహించిందో ఏమో కానీ, అక్కడే ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్నది. రెండు రోజులుగా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సౌమ్యశ్రీ తనువు చాలించింది. ఆమెను రక్షించబోయిన మరో విద్యార్థి తీవ్రగాయాలతో ఆసుపత్రిలోనే చికిత్స పొందుతున్నాడు.
Odisha: ఎంతో పోరాడి ఓడిన సౌమ్యశ్రీ చనిపోయాక సర్కారు నష్టనివారణ చర్యలకు దిగింది. హెచ్‌వోడీ సమీర్‌కుమార్ సాహూను అరెస్టు చేసి, ప్రిన్సిపాల్ దిలీప్ ఘోష్‌ను సస్పెండ్ చేసిన ఉన్నతాధికారులు ఘటనపై విచారణకు ఆదేశించారు. ఈ ఘటనపై ఎన్‌సీడబ్ల్యూ, ఎన్‌హెచ్ఆర్‌సీ దర్యాప్తును ప్రారంభించాయి. అదే విధంగా విద్యార్థిని కుటుంబానికి రూ.20 లక్షల నష్టపరిహారం చెల్లిస్తామని, బాధ్యులను కఠినంగా శిక్షిస్తామని ఆ రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది.
