Nuziveedu Seeds: నూజివీడు సీడ్స్ లిమిటెడ్ (ఎన్ఎస్ఎల్) చైర్మన్, వ్యవస్థపాకుడు మండవ వెంకట్రామయ్య (94) కన్నుమూశారు. ఆయన గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఏలూరు జిల్లా నూజివీడు మండలం తుక్కలూరులోని తన స్వగృహంలో తుదిశ్వాస విడిచారని ఆయన కుమారుడు, ఎన్ఎస్ఎల్ ఎండీ ప్రభాకర్‌రావు వెల్లడించారు.
Nuziveedu Seeds: ఉన్నత విద్యాభ్యాసం చేసిన మండవ వెంకట్రామయ్యకు భార్య, ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. ఆయన బెనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో ఎమ్మెస్సీ పూర్తిచేశారు. విద్యాభ్యాసం పూర్తయ్యాక ఆయన స్వగ్రామం తిరిగొచ్చారు. అదే సమయంలో దేశంలో ప్రైవేటు విత్తనరంగం ప్రారంభమైంది. ఈ మేరకు ఆయనలో ఓ కొత్త ఆలోచన మెరిసింది. తనే సొంతంగా విత్తన పరిశ్రమను ఏర్పాటు చేయాలనే భావన కలిగింది.
Nuziveedu Seeds: ఈ మేరకు మండవ వెంకట్రామయ్య 1973లో నూజివీడు సీడ్స్ పేరిట విత్తన కంపెనీని స్థాపించారు. అప్పటి నుంచి ఈ కంపెనీ తయారు చేసిన విత్తనాలు ఉమ్మడి రాష్ట్రవ్యాప్తంగా సరఫరా చేయడంతోపాటు దేశంలోని ఇతర ప్రాంతాలకు కూడా ఎగుమతి చేసేవారు. ఆ తర్వాత ఆయన బాటలోనే ఆయన తనయుడు ప్రభాకర్‌రావు కంపెనీని అభివృద్ధి బాటలో నడుపుతూ అనుబంధంగా అనేక పరిశ్రమలను స్థాపించారు.
Nuziveedu Seeds: నూజివీడు సీడ్స్ గ్రూప్ వ్యవస్థాపకుడు, చైర్మన్ మండవ వెంకట్రామయ్య మృతికి పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు తదితరులు సంతాపం తెలిపారు. మండవ వెంకట్రామయ్య మృతి తీరనిలోటని పేర్కొన్నారు. వెంకయ్యనాయుడు స్వయంగా తుక్కులూరు వెళ్లి వెంకట్రామయ్య పార్థివదేహానికి ఘనంగా నివాళులర్పించారు. ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి, ధైర్యం చెప్పారు.