IPL 2026: డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) అభిమానులకు ఇది బిగ్ షాక్. ఐపీఎల్ 2026 సీజన్‌లో ఆర్‌సీబీ తన హోమ్ మ్యాచ్‌లను బెంగళూరులోని ఐకానిక్ చిన్నస్వామి స్టేడియంలో ఆడే అవకాశం కోల్పోయింది. భద్రతా కారణాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ క్రమంలో ఛత్తీస్‌గఢ్ రాజధాని రాయ్‌పూర్‌లోని షాహీద్ వీర్ నారాయణ్ సింగ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం ఆర్‌సీబీకి తాత్కాలిక హోమ్ గ్రౌండ్‌గా మారనుంది.
ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి విష్ణు దేవ్ సాయి ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడించారు. ఆర్‌సీబీ సీఈఓ రాజేష్ మీనన్‌తో జరిగిన సమావేశం అనంతరం ఆయన మాట్లాడుతూ.. రాయ్‌పూర్‌లో రెండు ఐపీఎల్ మ్యాచ్‌లు నిర్వహించాలని నిర్ణయించినట్లు ప్రకటించారు. “ఆర్సీబీ సీఈఓ మమ్మల్ని కలిశారు, ఇక్కడ రెండు మ్యాచ్‌ల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లపై చర్చించాం” అని సీఎం తెలిపారు. గతంలో 2013లో రాయ్‌పూర్ ఐపీఎల్ మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇవ్వగా, మళ్లీ ఇన్నాళ్లకు ఐపీఎల్ సందడి ఆ రాష్ట్రానికి చేరుకోనుంది.
ఇది కూడా చదవండి: Horoscope Today: భోగి పండుగ వేళ ఈ రాశుల వారికి అదృష్టం మామూలుగా లేదు!
గత ఏడాది ఐపీఎల్ 2025లో ఆర్‌సీబీ తొలిసారి టైటిల్ గెలిచిన సందర్భంగా బెంగళూరులో భారీ విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. ఆ సమయంలో చిన్నస్వామి స్టేడియం వద్ద జరిగిన ఘోర తొక్కిసలాటలో 11 మంది ప్రాణాలు కోల్పోగా, 50 మందికి పైగా గాయపడ్డారు. ఈ ఘటనపై విచారణ జరిపిన జ్యుడీషియల్ కమిషన్, భారీ జన సమూహాలకు ఈ స్టేడియం సురక్షితం కాదని నివేదిక ఇచ్చింది. దీంతో ఈ వేదికను 2025 మహిళల ప్రపంచకప్, 2026 పురుషుల టీ20 ప్రపంచకప్ మ్యాచ్‌ల జాబితా నుంచి కూడా తొలగించారు. కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్ (KSCA) అధ్యక్షుడు వెంకటేష్ ప్రసాద్ ప్రయత్నాలు చేసినప్పటికీ, స్టేడియానికి భద్రతా అనుమతులు లభించలేదు.
ఆర్‌సీబీ తన మిగిలిన 5 హోమ్ మ్యాచ్‌లను నవీ ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో ఆడనుంది. అంటే 2026 సీజన్‌లో ఆర్‌సీబీ తన సొంత గడ్డపై ఒక్క మ్యాచ్ కూడా ఆడే అవకాశం లేదు. బెంగళూరు ఫ్యాన్స్‌కు ఇది పెద్ద ఎదురుదెబ్బ అయినప్పటికీ, ఆటగాళ్ల మరియు ప్రేక్షకుల భద్రత దృష్ట్యా ఫ్రాంచైజీ ఈ ప్రత్యామ్నాయ వేదికలను ఎంచుకుంది
