Nobel Prize 2024: రసాయన శాస్త్రంలో ముగ్గురికి నోబెల్ బహుమతి ప్రకటించారు. ప్రొటీన్ల నిర్మాణాన్ని అంచనా వేసేందుకు కృత్రిమ మేధస్సును ఉపయోగించినందుకు గాను 2024 సంవత్సరానికి డేవిడ్ బేకర్, డెమిస్ హస్సాబిస్, జాన్ ఎం జంపర్‌లకు ఈ పురస్కారాన్ని అందించినట్లు స్వీడన్‌లోని కరోలిన్‌స్కా ఇన్‌స్టిట్యూట్ మెడికల్ యూనివర్శిటీలో నోబెల్ కమిటీ బుధవారం వెల్లడించింది.
కంప్యూటేషనల్ ప్రోటీన్ డిజైన్ పై పరిశోధనకు గానూ బేకర్‌కు, ప్రోటీన్ స్ట్రక్చర్ ప్రిడిక్షన్ పై పరిశోధనకు గానూ హస్సాబిస్, జంపర్ లు ఈ పరస్కారాన్ని అందుకోనున్నారు. ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన ఈ బహుమతిని రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ప్రదానం చేస్తుంది. ఈ ప్రైజ్ మనీ విలువ 11 మిలియన్ స్వీడిష్ క్రౌన్స్ ఉంటుంది.
కాగా, సోమవారం వైద్యశాస్త్రంలో విషేశ కృషి చేసిన ఇద్దరు అమెరికా శాస్త్రవేత్తలకు నోబెల్ బహుమతి వరించింది. మైక్రో ఆర్‌ఎన్‌ఏ, జన్యు నియంత్రణలో దాని పాత్రను కనుగొన్నందుకు గుర్తింపుగా శాస్త్రవేత్తలు విక్టర్ అంబ్రోస్, గ్యారీ రువ్‌కున్ లకు నోబెల్ బహుమతిని ప్రకటించారు. 2024 ఫిజియాలజీ లేదా మెడిసిన్‌లో వీరిద్దరు ఈ బహుమతిని గెలుచుకున్నట్లు అవార్డు ప్రదాన సంస్థ నోబెల్ కమిటీ తెలిపింది. జన్యు నియంత్రణలో కీలక పాత్ర పోషిస్తున్న చిన్న RNA అణువుల కొత్త తరగతిని వీరు కనుగొన్నట్లు పేర్కొంది.