iBomma Ravi

iBomma Ravi: గుట్టు విప్పని పైరసీ కింగ్!.. ఐబొమ్మ రవి కస్టడీ ముగిసింది

iBomma Ravi: సినీ పరిశ్రమను కలవరపెట్టిన పైరసీ కేసులో ప్రధాన నిందితుడు, ఐబొమ్మ (iBomma) వెబ్‌సైట్ నిర్వాహకుడు ఇమ్మడి రవి మూడు రోజుల పోలీసు కస్టడీ శుక్రవారం (నవంబర్ 29, 2025) తో ముగిసింది. కస్టడీ ముగియడంతో సైబర్ క్రైమ్ పోలీసులు రవిని నాంపల్లి కోర్టులో హాజరుపరచనున్నారు. ఈ మూడు రోజుల విచారణలో పోలీసులు ఎన్నో సాంకేతిక, ఆర్థిక వివరాలను రాబట్టే ప్రయత్నం చేసినప్పటికీ, పైరసీ నెట్‌వర్క్‌కు సంబంధించిన పూర్తి గుట్టును మాత్రం రవి విప్పలేదని తెలుస్తోంది.

పోలీస్ కస్టడీలో ఉన్న సమయంలో ఇమ్మడి రవి పశ్చాత్తాపం వ్యక్తం చేసినట్లు సమాచారం. “ఇకపై పైరసీ జోలికి వెళ్లను. బయటికి వెళ్లిన తర్వాత పైరసీ గురించి ఆలోచించను” అని పోలీసుల ఎదుట రవి పేర్కొన్నట్లు సైబర్ క్రైమ్ వర్గాలు తెలిపాయి. అయితే, రవి ఈ విధంగా పశ్చాత్తాపం వ్యక్తం చేసినప్పటికీ, తన నెట్‌వర్క్‌కు సంబంధించిన కీలక వివరాలను మాత్రం చివరి వరకు చెప్పేందుకు సహకరించలేదని తెలుస్తోంది.

ఆర్థిక వ్యవహారాలపైనే ప్రధాన దృష్టి

నవంబర్ 27న చంచల్ గూడ జైలు నుంచి రవిని సీసీఎస్‌కు తీసుకువచ్చిన పోలీసులు, తొలిరోజు విచారణలో ఎన్జిలా నెట్‌వర్క్ (Ngila network) తో పాటు ఆర్థిక వ్యవహారాలపై దృష్టి సారించారు.

రవి పైరసీతో పాటు గేమింగ్, బెట్టింగ్ యాప్‌ల నిర్వహణ ద్వారా కోట్లు గడించినట్లు పోలీసులు గుర్తించారు. యాడ్ బుల్ (Ad Bull) వంటి యాప్‌లను నిర్వహించడానికి గల కారణాలపై కూడా దర్యాప్తు చేశారు.

ఇది కూడా చదవండి: Road Accident: కర్నూలులో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు మృతి

ఐపీ మాస్క్ చేసి అనధికారిక వెబ్‌సైట్‌లను నిర్వహిస్తున్న కొన్ని ముఠాల గురించి కూడా కీలక లీడ్ సంపాదించిన పోలీసులు, ఈ విషయంలో రవిని ప్రశ్నించారు. పోర్న్ వెబ్‌సైట్‌లు, పైరసీ వీడియోలను అప్‌లోడ్ చేస్తున్న వెబ్‌సైట్‌లను క్లోజ్ చేసేందుకు కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి.

విచారణలో సహకరించని రవి

మొదటి రోజు కొన్ని కీలక లీడ్స్ సంపాదించినప్పటికీ, రెండో రోజు విచారణలో రవి ఏ మాత్రం సహకరించలేదని, పోలీసుల ప్రశ్నలకు సమాధానం చెప్పలేదని సమాచారం. మూడో రోజు కూడా సాంకేతిక వివరాలతో పాటు దేశ విదేశాల్లోని ఏజెంట్లు, ఉద్యోగుల వివరాల గురించి పోలీసులు గట్టిగా ఆరా తీసినా, రవి నోరు విప్పలేదని తెలుస్తోంది.

దాదాపు ఆరేళ్లుగా తనను పోలీసులు పట్టుకోలేకపోవడంతో తన నెట్‌వర్క్‌ను విస్తరించానని రవి చెప్పినట్లు తెలుస్తోంది. అలాగే, విదేశీ పౌరసత్వం ఉండడంతో పైరసీ గుట్టు బయటపడినా తప్పించుకోవచ్చనే ధీమాతో రవి ఉన్నట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ, మూడు రోజుల కస్టడీ పూర్తవడంతో పోలీసులు రాబట్టిన ప్రాథమిక సమాచారాన్ని కోర్టుకు సమర్పించనున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *