CM Revanth Reddy: తెలంగాణ రాష్ట్రం 79వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంది. గోల్కొండ కోటలో జరిగిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఆయన రాష్ట్ర ప్రజలనుద్దేశించి మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన గత ప్రభుత్వ విధానాలపై విమర్శలు, తమ ప్రభుత్వ లక్ష్యాలను, అమలు చేసిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు.
సంక్షేమానికి అధిక ప్రాధాన్యత:
సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, తమ ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం అహర్నిశలు కృషి చేస్తోందన్నారు. దేశంలో మరెక్కడా లేని విధంగా 3.10 కోట్ల మందికి సన్నబియ్యం పంపిణీ చేసి పేదల ఆత్మగౌరవాన్ని కాపాడామని తెలిపారు. వరంగల్‌లో హామీ ఇచ్చిన విధంగా 25 లక్షల మంది రైతుల రుణాలను మాఫీ చేసి, వారిని రుణవిముక్తులను చేశామన్నారు. రైతుల కోసం క్వీంటాల్ సన్నధాన్యానికి రూ. 500 బోనస్ ఇస్తున్నామని, వ్యవసాయానికి ఏటా రూ. 16 వేల కోట్లు ఖర్చు చేస్తూ ఉచిత విద్యుత్ అందిస్తున్నామని వివరించారు. గత 20 నెలల్లో రైతుల కోసం రూ. 1.13 లక్షల కోట్లు అందించామని తెలిపారు.
Also Read: Deputy CM Pawan Kalyan: స్వాతంత్ర్య వేడుకల్లో పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు
నీటి వాటాలపై రాజీపడేది లేదు:
కృష్ణా, గోదావరి జలాల వాటాలపై తెలంగాణకు ఎలాంటి రాజీ ఉండదని సీఎం రేవంత్ స్పష్టం చేశారు. తెలంగాణ అవసరాలు తీరిన తర్వాతే ఇతర రాష్ట్రాలకు నీటిని అందించే విషయాన్ని పరిశీలిస్తామని అన్నారు. గత ప్రభుత్వం రూ. లక్ష కోట్లతో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయిందని విమర్శిస్తూ, తమ ప్రభుత్వం ఎస్.ఎల్.బి.సి, పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులను పూర్తి చేసి, రాష్ట్రంలో చివరి ఆయకట్టు వరకు నీరందిస్తుందని హామీ ఇచ్చారు.
హైదరాబాద్ బ్రాండింగ్, యువతకు ఉద్యోగాలు:
హైదరాబాద్ నగరం బ్రాండింగ్‌ను మరింత పెంచేందుకు చర్యలు తీసుకుంటామని సీఎం తెలిపారు. ప్రపంచ సుందరీమణుల పోటీలకు హైదరాబాద్ వేదికగా నిలవడం, ఏ.ఐ. సిటీ నిర్మాణానికి భూమి కేటాయించడం వంటివి నగరం ప్రాధాన్యతను చాటిచెబుతున్నాయన్నారు. యువతను డ్రగ్స్‌కు బానిస చేసే కుట్రలను ఛేదించి, 20 నెలల్లో 60 వేల ప్రభుత్వ ఉద్యోగాలను కల్పించామని పేర్కొన్నారు. ప్రతి నియోజకవర్గానికి 3500 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేశామని, ఆర్టీసీ ఉద్యోగులకు ఒకటో తేదీన జీతాలు ఇస్తున్నామని చెప్పారు. అలాగే, ‘హైడ్రా’ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ భూములను ఆక్రమణల నుంచి రక్షించి, చెరువులను పునరుద్ధరించామని తెలిపారు.
