Nizamabad: నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకున్నది. ప్రేమించిన పాపానికి ఓ నిండు ప్రాణం బలైంది. నిజాయితీ ప్రేమకు ప్రాణమే పోయింది. తన ప్రేమను పెళ్లి బంధంతో ఒక్కటి చేసుకుందామనుకుని సముద్రాలు దాటి వచ్చేలోపే ఆ ప్రేమ విచ్ఛిన్నమై.. ఆ యువకుడి ప్రాణమే తీసుకోవాల్సి వచ్చింది. దీనికి ఆ యువతి కుటుంబ సభ్యుల వైఖరే కారణమని తెలుస్తున్నది.
Nizamabad: నిజామాబాద్ జిల్లా మోర్తాడ్ మండలం దోమచంద గ్రామంలో గత ఆరేళ్లుగా శ్రీకాంత్‌రెడ్డి మరో యువతి ప్రేమించుకుంటున్నారు. లండన్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తూ తన ప్రేయసి కోసం శ్రీకాంత్‌రెడ్డి కలలు కనేవాడు. ఇద్దరం ఒక్కటై హాయిగా జీవితం పంచుకోవాలని భావించాడు. తాను ఒకటి అనుకుంటే విధి మరొకటి తలిచింది. అదే ఆయన ప్రాణాన్ని బలితీసుకున్నది.
Nizamabad: ప్రేమించిన ఆ యువతిని పెళ్లి చేసుకుందామని శ్రీకాంత్‌రెడ్డి లండన్ నగరం నుంచి సొంతూరికి తిరిగొచ్చాడు. ఇక్కడ జరిగిన ఘటనను చూసి అవాక్కయ్యాడు. ఆ యువకుడికి గుండె ఆగినంత పనైంది. తాను ప్రేమించిన ఆ యువతిని మరో యువకుడితో ఆమె తండ్రి పెళ్లి చేశాడు. ఈ విషయం తెలియగానే శ్రీకాంత్‌రెడ్డి మనస్తాపం చెందాడు. తాను కన్న కలలు కల్లలయ్యాయని భావించాడు.
Nizamabad: తనతో తన ప్రేయసి లేని జీవితం తనకు వద్దని ప్రాణం తీసుకునేందుకు నిర్ణయించుకున్నాడు. దీంతో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఇది తెలిసి శ్రీకాంత్‌రెడ్డి కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. అక్కడే చికిత్స పొందుతూ తనువు చాలించాడు. ప్రేయసి కోసం కోటి కలలతో వచ్చిన ఆ యువకుడికి అప్పుడే నిండా నూరేళ్లు నిండాయి.
Nizamabad: ఇదిలా ఉండగా, శ్రీకాంత్‌రెడ్డి మృతదేహాన్ని తీసుకొని అతని కుటుంబ సభ్యులు తీవ్ర నిరసన వ్యక్తంచేశారు. పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పోలీస్ వాహనంపై మృతదేహాన్ని ఉంచి నిరసన వ్యక్తంచేశారు. మృతుడి కుటుంబ సభ్యులకు, బంధువులు, గ్రామస్థులకు పోలీసులు సర్దిచెప్పి, బాధ్యులపై కేసు నమోదు చేస్తామని చెప్పి ఆందోళన విరమించాలని కోరారు.

