Nizamabad: సరిగ్గా ఈ సీన్ చూస్తే మీకు అలాగే అనాలనిపిస్తుంది కదూ.. నిజమేనండీ ఎదురుగా రైలు వస్తుంది.. అదే పట్టాలపై బైక్‌ను నడుపుతూ ఎదురే వెళ్లాడు. అతని చిన్న మెదడు ఏమైనా చితికిందా? లేక మందేసి ఇలా చిందేయబోయాడా? కుటుంబంలో గొడవులుండి తనువు చాలించాలనుకున్నాడో ఏమో మనోడు ఏమరపాటుగా ఉన్నాడో? ఏమో కానీ గేట్ కీపర్ సమయస్ఫూర్తితో ప్రాణాలను దక్కించుకున్నాడు. నిజామాబాద్ జిల్లా నవీపేట మండలం దర్వాపూర్ రైల్వేగేటు వద్ద గురువారం ఈ ఘటన చోటుచేసుకున్నది.
Nizamabad: దర్వాపూర్ రైల్వేగేటు సమీపంలో తిరుపతి వైపు వెళ్తున్న రైలుకు ఎదురుగా అదే పట్టాలపై బైక్‌పై దూసుకెళ్తున్నాడు. రైలుకు ఎదురుగా బైక్ వెళ్తున్న విషయాన్ని సమీపంలో ఉన్న రైల్వే గేట్ కీపర్ గమనించాడు. వెంటనే నవీపేట స్టేషన్ మాస్టర్‌కు సమాచారం అందించాడు. ఆయన లోకో పైలెట్‌కు విషయం చెప్పడంతో సమీపంలోకి రాగానే రైలును నిలిపేశారు. దీంతో ఎదురుగా బైక్‌పై వస్తున్న వ్యక్తి ప్రాణం దక్కింది.
అయితే బైక్‌ను నడిపిన వ్యక్తి వివరాలు తెలియాల్సి ఉన్నది. స్టేషన్ మాస్టర్ ఫిర్యాదు మేరకు ఆర్పీఎఫ్ పోలీసులు వాహనదారుడిని అదుపులోకి తీసుకున్నారు. విచారణ నిమిత్తం నిజామాబాద్ కార్యాలయానికి తీసుకెళ్లారు.