Nitish Kumar: బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ప్రవర్తన రాష్ట్ర రాజకీయాల్లో పెను దుమారం సృష్టిస్తోంది. తాజాగా, ముఖ్యమంత్రి నివాసంలో జరిగిన ఓ కార్యక్రమంలో కొత్తగా నియమితులైన ఓ మహిళా వైద్యురాలి హిజాబ్‌ను సీఎం నితీష్ బలవంతంగా లాగిన ఘటన ఇప్పుడు తీవ్ర విమర్శలకు దారితీసింది. వేదికపైనే జరిగిన ఈ ‘అసహ్యకరమైన చర్య’కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో, ప్రతిపక్షాలు ముఖ్యమంత్రిపై మాటల దాడికి దిగాయి.
సోమవారం (డిసెంబర్ 15) నాడు, కొత్తగా నియామక పత్రాలు అందుకోవడానికి వచ్చిన ఆయుష్ వైద్యులకు సీఎం నితీష్ కుమార్ వాటిని అందజేశారు. ఈ క్రమంలోనే, నియామక పత్రం అందుకోవడానికి వచ్చిన ముస్లిం మహిళా వైద్యురాలు వద్దని వారించినా లెక్క చేయకుండా, సీఎం నితీష్ ఆమె హిజాబ్‌ను బలవంతంగా తొలగించారు.
సీఎం ఆకస్మిక చర్యతో ఆ యువ వైద్యురాలు తీవ్ర అసౌకర్యానికి, ఇబ్బందికి గురయ్యారు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అత్యున్నత వేదికపై, అత్యున్నత పదవిలో ఉండి ఇలాంటి చర్యకు పాల్పడటంపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది.
ఇది కూడా చదవండి: Kamareddy district: ప్రత్యర్థి వర్గంపై కాంగ్రెస్ నుంచి గెలిచిన సర్పంచ్ దౌర్జన్యం
కాంగ్రెస్, ఆర్జేడీల తీవ్ర ఖండన
ఈ ఘటనపై కాంగ్రెస్ పార్టీ, ఆర్జేడీ (RJD) పార్టీలు తీవ్రస్థాయిలో మండిపడ్డాయి.
-
కాంగ్రెస్ ఆగ్రహం: కాంగ్రెస్ పార్టీ ఈ ఘటనను ‘సిగ్గులేని, నీచమైన చర్య’గా అభివర్ణించింది. “ఈ దుర్మార్గం క్షమించరానిది” అని ఖండించిన కాంగ్రెస్ నాయకులు, నితీష్ కుమార్ వెంటనే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. బహిరంగంగానే మహిళల పట్ల ఇలాంటి ప్రవర్తన కనబరిస్తే, ఇక రాష్ట్రంలో మహిళల భద్రతకు ఎవరు బాధ్యత వహిస్తారని కాంగ్రెస్ ప్రశ్నించింది.
-
ఆర్జేడీ ఎద్దేవా: ప్రతిపక్ష ఆర్జేడీ పార్టీ ముఖ్యమంత్రి మానసిక స్థితిపై తీవ్ర విమర్శలు చేసింది. “సీఎం నితీష్ మానసిక స్థితి పూర్తిగా గతి తప్పింది. తన ప్రవర్తనతో నితీష్ బాబు 100 శాతం సంఘీ అనిపించుకున్నారు” అని ఆర్జేడీ ఎద్దేవా చేసింది.
ప్రభుత్వ వేదికపైనే ఒక మహిళా ఉద్యోగిని వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగించడం, ఆమె ధరించిన వస్త్రధారణ విషయంలో బలవంతంగా జోక్యం చేసుకోవడంపై వివిధ వర్గాల నుండి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఈ ఘటనపై ఇంతవరకు స్పందించలేదు. ప్రతిపక్షాల ఆందోళన నేపథ్యంలో, ఈ అంశం బీహార్ రాజకీయాలను మరింత వేడెక్కించడం ఖాయంగా కనిపిస్తోంది.
