Nitin gadkari: కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ రాబోయే సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో తన పాత్రపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గత 11 సంవత్సరాల్లో ప్రజలు చూసింది కేవలం ఒక న్యూస్ రీల్ మాత్రమేనని, అసలైన సినిమా మాత్రం ఇంకా ప్రారంభం కాలేదని స్పష్టం చేశారు. పార్టీ ఏ బాధ్యతలు అప్పగించినా, వాటిని పూర్తి నిబద్ధతతో నిర్వహించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని గడ్కరీ పేర్కొన్నారు.
ఇటీవలి ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆయన తన భవిష్యత్ లక్ష్యాలు, రాజకీయ ప్రస్థానం గురించి వివరించారు. “ఇప్పటివరకు మీరు చూసింది కేవలం టీజర్ మాత్రమే. అసలైన కథనం ఇప్పుడు మొదలుకానుంది. పార్టీ ఏ విధమైన బాధ్యతలు అప్పగించినా, చిత్తశుద్ధితో పనిచేస్తాను” అని గడ్కరీ తెలిపారు.
ఇటీవల రహదారి ప్రాజెక్టులకు బదులుగా వ్యవసాయం మరియు సామాజిక సేవాపథకాలపై దృష్టి పెట్టుతున్నట్లు ఆయన వెల్లడించారు. మోదీ నాయకత్వంలో గత 11 సంవత్సరాల ప్రభుత్వాన్ని గుర్తు చేస్తూ, తాను ముఖ్యంగా విదర్భ ప్రాంతంలో రైతుల ఆత్మహత్యలు తగ్గించేందుకు కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు.
దేశ అభివృద్ధి పరంగా తలసరి ఆదాయంలో భారత్ ఇంకా ప్రపంచ టాప్ 10 దేశాల్లోకి ఎందుకు ప్రవేశించలేకపోతుందనే ప్రశ్నకు సమాధానం ఇస్తూ, “ఇది ప్రధానంగా జనాభా వృద్ధి కారణంగా జరుగుతోంది. జనాభా నియంత్రణను మతం లేదా భాష కోణంలో చూడకూడదు. ఇది ఆర్థిక సమస్యగా పరిగణించాలి” అని గడ్కరీ వివరించారు.
భారతదేశ అభివృద్ధిలో మోదీ ప్రభుత్వ విప్లవాత్మక చర్యలు ముఖ్యపాత్ర వహించాయని ఆయన పేర్కొన్నారు. గత రెండు టర్ముల్లో తీసుకున్న నిర్ణయాలు దేశాన్ని పురోగతి దిశగా నడిపించాయని, వివిధ రంగాల్లో సాధించిన విజయాలు దానికి నిదర్శనమని ఆయన అభిప్రాయపడ్డారు.
