Nirmala sitaraman: రష్యా నుంచి చమురు కొనుగోలు విషయంలో అమెరికా ఒత్తిడులకు భారత్ తలొగ్గే ప్రసక్తే లేదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. దేశ ప్రయోజనాలే ప్రాధాన్యం అని, భారత్ తీసుకునే నిర్ణయాలు పూర్తిగా దేశ అవసరాల ఆధారంగానే ఉంటాయని ఆమె స్పష్టం చేశారు.
ఒక ప్రైవేట్ టీవీ ఛానల్‌తో మాట్లాడిన సీతారామన్, “విషయం రష్యా చమురు అయినా, మరేదైనా సరే… మాకు ఏది అనుకూలంగా ఉంటే అదే నిర్ణయం తీసుకుంటాం. ముఖ్యంగా ధర, రవాణా వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుంటాం. విదేశీ మారకద్రవ్యంపై భారీ ప్రభావం చూపే ముడి చమురును ఎక్కడి నుంచి దిగుమతి చేసుకోవాలో పూర్తిగా మా అవసరాలపై ఆధారపడి ఉంటుంది. కాబట్టి, మేము రష్యా నుంచి చమురు కొనుగోలును నిరంతరం కొనసాగిస్తాం” అని స్పష్టం చేశారు.
దేశ దిగుమతుల బిల్లులో అత్యధిక భాగం ముడి చమురుదేనని ఆమె మరోసారి గుర్తు చేశారు.
ఇక, రష్యా నుంచి చమురు కొనుగోలు చేయడం ద్వారా భారత్ ఉక్రెయిన్ యుద్ధానికి పరోక్షంగా ఆర్థిక సాయం అందిస్తోందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఆ ఆరోపణల అనంతరం ఆగస్టు 27 నుంచి భారత్‌పై మొత్తం 50 శాతం దిగుమతి సుంకం విధించారు. ఈ పరిణామాల నడుమ సీతారామన్ చేసిన వ్యాఖ్యలు విశేష ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

