Nirmala sitaraman: కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ జీఎస్టీ సంస్కరణల ప్రభావాన్ని వివరించారు. ఆదివారం చెన్నైలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ, “ఉదయం తాగే టీ నుంచి రాత్రి భోజనం వరకు ప్రతి అంశంలోనూ జీఎస్టీ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. ఈ సంస్కరణల సానుకూల ఫలితాలు సామాన్యులకు మేలు చేస్తున్నారు” అని అన్నారు.
గతంలో 12 శాతం పన్ను శ్లాబులో ఉన్న 99 శాతం వస్తువులను 5 శాతం పరిధిలోకి తీసుకువచ్చినట్లు సీతారామన్ తెలిపారు. దీని వల్ల నిత్యావసరాలు చౌకగా లభించడంతో వినియోగదారులకు ఉపశమనం కలుగుతోందని చెప్పారు. ఇన్‌పుట్ ఖర్చులు తగ్గడం వలన ఉత్పత్తి వ్యయం కూడా తగ్గి, ధరల భారం తగ్గిందని ఆమె వివరించారు.
పన్నుల పరిధి విస్తరణ: గత ఎనిమిదేళ్లలో పన్ను పరిధిలోకి వచ్చే వ్యాపారాల సంఖ్య 66 లక్షల నుంచి 1.5 కోట్లకు పెరిగిందని మంత్రి గణాంకాలతో వివరించారు. పారదర్శక, సులభతర పన్ను విధానాల కారణంగా వ్యాపారులకు ఎలాంటి గందరగోళం లేకుండా పోయిందని, దీంతో తయారీదారులు, పంపిణీదారులు పన్ను వ్యవస్థలో చేరుతున్నారని తెలిపారు.
వసూళ్ల పెరుగుదల: 2018లో రూ. 7.18 లక్షల కోట్లుగా ఉన్న స్థూల జీఎస్టీ వసూళ్లు ప్రస్తుతం రూ. 22.08 లక్షల కోట్లకు పెరిగాయని సీతారామన్ వెల్లడించారు. ఈ పెరుగుదల రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా లాభం చేకూరుస్తోందని చెప్పారు.
తనపై వస్తున్న విమర్శలకు సమాధానమిస్తూ, “ప్రజలను ఇబ్బంది పెట్టడం మా ఉద్దేశం కాదు. దేశ ప్రయోజనం కోసం పనిచేస్తున్నాం” అని స్పష్టం చేశారు. జీఎస్టీ కౌన్సిల్‌లో రాష్ట్ర ఆర్థిక మంత్రులు కూడా భాగస్వాములేనని, అన్ని నిర్ణయాలు సమష్టిగానే తీసుకుంటున్నామని మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు.