Nimmala ramanaidu: ఆంధ్రప్రదేశ్ మాజీ ప్రభుత్వం సాగునీటి రంగాన్ని పూర్తిగా ధ్వంసం చేసిందని, ఇప్పుడు సీఎం చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ఆ రంగాన్ని తిరిగి ప్రగతి పథంలోకి తీసుకువస్తోందని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. మంగళవారం టీడీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ గత ఐదేళ్లలో జగన్ ప్రభుత్వం సాగునీటి రంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసిందని విమర్శించారు. 2014–19 మధ్య చేపట్టిన అనేక పనులను జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక రివర్స్ టెండరింగ్ పేరిట రద్దు చేశారని, దీనివల్ల రాష్ట్రంలోని రైతులు తీవ్రమైన నష్టాలను ఎదుర్కొన్నారని అన్నారు.
అన్నమయ్య ప్రాజెక్టు వంటి ముఖ్యమైన నిర్మాణాలు ఇసుక మాఫియా కారణంగా దెబ్బతిని 42 మంది ప్రాణాలు కోల్పోయిన ఘటనను మంత్రి ప్రస్తావించారు. పులిచింతల, గుండ్లకమ్మ వంటి ప్రాజెక్టుల గేట్లు కొట్టుకుపోయినా గత ప్రభుత్వం పట్టించుకోలేదని, ఫలితంగా అనేక నియోజకవర్గాల్లో వేల ఎకరాల్లో సాగు దిగుబడులు తగ్గి రైతులు వలసకు వెళ్లాల్సి వచ్చిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడంపై ప్రభుత్వం అత్యంత దృష్టి పెట్టిందని మంత్రి తెలిపారు. 2027 జులైలో జరిగే గోదావరి పుష్కరాల నాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తిచేయడమే తమ లక్ష్యమని చెప్పారు. ఇప్పటివరకు నిర్వాసితులకు ఏడాదిలోనే రూ.1,900 కోట్లు అందించామని, 2026 నాటికి పునరావాస కాలనీలన్నీ పూర్తిచేస్తామని వివరించారు.
అదేవిధంగా హంద్రీనీవా ప్రాజెక్టు పనులు మరుసటి ఏడాదిలో పూర్తి చేసి రాయలసీమను రతనాల సీమగా మార్చే లక్ష్యంతో పనిచేస్తున్నామని మంత్రి నిమ్మల చెప్పారు. రూ.3,870 కోట్లతో ఈ పనులు వేగంగా కొనసాగుతున్నాయని తెలిపారు. వెలిగొండ ప్రాజెక్టు కూడా 2026 జూన్ నాటికి పూర్తి చేసేలా చర్యలు కొనసాగుతున్నట్లు చెప్పారు. ఇప్పటికే శ్రీశైలం మరియు ధవళేశ్వరం ప్రాజెక్టుల మరమ్మతులకు నిధులు విడుదల చేశామని వివరించారు.
కృష్ణా జలాల సమస్యపై మాట్లాడుతూ, ప్రస్తుతం జరుగుతున్న చర్చలకు జగన్ ప్రభుత్వం అసమర్థతే కారణమని మంత్రి ఆరోపించారు. 2020లో అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో తెలంగాణ కొత్త ప్రతిపాదనలు తెచ్చినప్పటికీ జగన్ మౌనంగా ఉండటం వల్ల రాష్ట్ర ప్రయోజనాలకు నష్టం జరిగిందని విమర్శించారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం రాష్ట్ర హక్కులను రక్షించేందుకు బలమైన వాదనలు వినిపిస్తున్నదని తెలిపారు.
చంద్రబాబుపై ఉన్నవన్నీ ఆధారాలు లేని కేసులేనని, అందుకే కోర్టులు వాటిని కొట్టివేస్తున్నాయని మంత్రి నిమ్మల చెప్పారు.
